అన్నాడీఎంకేపై ఆధిపత్యం కోసం కొంతకాలంగా ఎవ్వరికీ వారుగా విఫల ప్రయత్నాలు చేస్తూ వస్తున్న జయలలిత సన్నిహితురాలు వికె శశికళ, మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం ఉమ్మడిగా వ్యూహరచనకు సిద్దపడుతున్నారా? పార్టీ నుండి తనను గెంటివేసి, మొత్తం పార్టీని ఆధీనంలోకి తెచ్చుకున్న మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామిపై ఒక వంక కోర్టులలో పోరాటం చేస్తూనే, మరోవంక రాజకీయంగా పావులు కదుపుతున్నారు.
పన్నీరుసెల్వంను పార్టీ నుండి బహిష్కరించడాన్ని ఖండిస్తూ, సానుభూతి వ్యక్తం చేసిన శశికళ ఇటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నట్లయింది. తానుండగా ఆ పార్టీని ముక్కలు కనివ్వను అంటూ ఘాటుగా ప్రకటన కూడా చేశారు. ఈ తరుణంలో ఈ ఇద్దరు నేతల భేటీకి రంగం సిద్దమైన్నట్లు తెలుస్తున్నది. అందుకు, జయలలిత మేనకోడలు దీప చొరవ తీసుకున్నట్లు చెబుతున్నారు.
వీరిద్దరిని ఆమె తన ఇంటికి విందుకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తున్నది. ఈ ముగ్గురూ ప్రస్తుతం దీప సొంతమైన పోయె్‌సగార్డెన్‌లోని జయ నివాసంలో కలవనున్నట్లు తెలుస్తున్నది. నిజానికి గత ఏడాది ఓపీఎస్ సతీమణి మరణించినప్పుడు శశికళ వెళ్లి పరామర్శించారు.
ఆమెను చూడగానే ఓపీఎస్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య సఖ్యత పెరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఆ ఇద్దరు నేతలు భేటీ కానున్నట్లు సమాచారం. నిజానికి శశికళతో కలిసి పని చేసేందుకు ఓపీఎస్ చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు.
అయితే శశికళ పార్టీలోకి రావడం ఏమాత్రం ఇష్టంలేని ఈపీఎస్.. ఆయన ప్రయత్నాలను అడ్డుకున్నారు. శశికళ అన్నాడీఎంకేలో చేరితే ఆ పార్టీ మరింత దృఢమవుతుందని బీజేపీలోని కొంతమంది రాష్ట్ర ముఖ్యనేతలు సహితం గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ ఈపీఎస్ ‘శశికళ చేరిక’ ఊసే లేకుండా చేస్తూ వచ్చారు.
ఇటీవల అన్నాడీఎంకేలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి, పార్టీ సమన్వయకర్త పదవి నుంచి ఓపీఎ్‌సను బహిష్కరిస్తూ అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, శాసనసభ ఉప నేత పదవి నుంచి పన్నీర్‌సెల్వంను తొలగించేందుకు ఈపీఎస్ సిద్ధమయ్యారు.
ఓపీఎస్‌తో కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండగా, మిగిలిన వారంతా ఈపీఎస్ వెంటవున్నారు. దీంతో పార్టీని సొంతం చేసుకున్నందుకు ఒకవైపు న్యాయపోరాటం చేస్తూనే, మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాలపై ఓపీఎస్ ముమ్మరంగా అన్వేషిస్తున్నారు. పార్టీ పగ్గాలు చేజారిపోవడంతో పన్నీర్‌సెల్వం, శశికళ ఏకంకావాలని జరుగుతున్న ప్రయత్నాల పట్ల ఈపీఎస్ వర్గం కలవరం చెందుతున్నట్లు తెలుస్తున్నది. వారి కదలికలపై నిఘా పెట్టినట్లు చెబుతున్నారు.
పళనిస్వామికి కొత్త తలనొప్పి
మొన్నటి వరకు పన్నీర్‌సెల్వంతో పోరాడిన ఎడపాడి పళనిస్వామికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. పార్టీ నుంచి పొన్నయ్యన్‌ను బహిష్కరించాలని మాజీ మంత్రులు కొందరు అప్పుడే నిరసన గళం విప్పారు. కన్యాకుమారి జిల్లాకు చెందిన పార్టీ ప్రముఖుడొకరు పొన్నయన్‌తో రహస్య సంభాషణ చేసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆడియో, ఆయనను బహిష్కరించాలనే డిమాండ్ ఎడపాడిని ఇరుకునపెట్టింది.
పళనిస్వామి డీఎంకే నేతలతో కుమ్మక్కై పార్టీని బలహీన పరచే ప్రయత్నం చేస్తున్నారని పన్నీరుసెల్వం ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా పలువురు పళనిసామి సన్నిహితులు డీఎంకే మంత్రులతో సన్నిహితంగా వ్యవహరిస్తూ ప్రభుత్వంలో పలు కాంట్రాక్టులు పొందుతూ భారీగా ఆర్ధిక ప్రయోజనాలు పొందుతున్నట్లు వెల్లడి అవుతున్నది.
మాజీ మంత్రి కేపీ మునుస్వామి డీఎంకే మంత్రి దురైమురుగన్ సిఫార్సుతో క్వారీల కాంట్రాక్టు పొంది నెలకు రూ.2 కోట్లు సంపాదిస్తున్నట్లు, అలాగే మాజీ మంత్రి తంగమణి సైతం తన అక్రమాస్తులను ఏసీబీ దాడుల నుంచి కాపాడుకునేందుకు సీఎం స్టాలిన్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్నారని, మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం గురించి విమర్శలు చేసినట్లు, ఎంజీఆర్, జయలలితల గురించి అమర్యాదగా మాట్లాడినట్లు ఆ ఆడియో సంభాషణల్లో ఉండటం గమనార్హం.