కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తలపెట్టిన ‘భారత్ జోడో’ యాత్ర అక్టోబరు 2 న ప్రారంభమవుతుందని ఆ పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్ ప్రకటించారు. ఈ యాత్ర 148 రోజుల పాటు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500 కిలోమీటర్ల మేర జరుగుతుందని వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రతిరోజు 25 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు.
తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ఈ యాత్ర ప్రారంభమై.. కాశ్మీర్లో ముగియనుంది. దాదాపు 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా యాత్ర జరుగుతుందని తెలిపారు. గురువారం జరిగిన అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ పదాధికారుల సమావేశంలో ‘భారత్ జాగో’ యాత్ర విధివిధానాలపై చర్చించినట్లు దిగ్విజయ్ చెప్పారు.
గత ఎనిమిది సంవత్సరాల బీజేపీ పరిపాలనలోని వైఫల్యాలు, ప్రజాస్వామ్యంపై దాడి, రాజ్యాంగ సంస్థలను వ్యక్తులపై ఉసిగొల్పడం, అధిక ధరలు, నిరుద్యోగం, రైతుల సమస్యలు ప్రధాన ఎజెండాగా యాత్ర కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రాల పీసీసీల సన్నద్ధత తర్వాత యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందనే దానిపై ప్రకటన చేస్తామని చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అక్కడి పీసీసీల రాష్ట్ర నాయకులు చేపట్టిన యాత్రలు కూడా ఇందులోకి చేరుతాయని పేర్కొన్నారు. మన దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనని, జాతిపిత హత్యకు దారితీసిన వారి సిద్ధాంతాల వల్లే నేడు ద్వేషపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని దిగ్విజయ్ సింగ్ ధ్వజమెత్తారు.
ఈ నేపథ్యంలో ‘భారత్ జోడో’ యాత్రను దేశవ్యాప్త ఉద్యమంగా ప్రారంభిస్తున్నామని చెప్పారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉదయ్ పూర్ చింతన్ శిబిర్ లో చేసిన నవ సంకల్పం లో భాగంగానే భారత్ జోడో యాత్ర ను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇలా ఉండగా, ఇటువంటి కీలక కార్యక్రమం రూపొందించే సమయంలో రాహుల్ గాంధీ లేకపోవడం, విదేశీ పర్యటనకు వెళ్లడం ఆ పార్టీ నేతలకే మింగుడు పడటం లేదు. ఆయన నాయకత్వ నిబద్దతపై అనే ప్రశ్నలకు తావిస్తోంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
అయితే ఏదో ఒక చోట కాంగ్రెస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు సందర్భాల్లో రాహుల్ విదేశీ పర్యటనలు చేయడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా గోవా కాంగ్రెస్లో సంక్షోభం నెలకొన్న వేళ.. రాహుల్ విదేశీ పర్యటనకు వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.