ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండిలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో కాన్వాయ్‌లోని వాహనాల అద్ధాలు ధ్వంసం అయ్యాయి. ఎంపీ కాన్వాయ్‌తో పాటు మరో రెండు కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
కారులో ఉన్న అరవింద్‌కు చెప్పుల దండ వేసేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. భారీ భద్రత నడుమ బీజేపీ ఎంపీ కాన్వాయ్‌ను అక్కడి నుంచి పంపించివేశారు. వరద బాధితులను పరామర్శించి, వరద సమస్యలు తెలుసుకొనేందుకు వస్తున్న సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు.
అర్వింద్ పై జరిగిన దాడి గురించి తెలిసి ఆయనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఆరా తీశారు. ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగిందని, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయని అమిత్ షాకు అర్వింద్ వివరించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ దాడులు చేస్తోందని అమిత్ షాకు తెలిపారు.
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అర్వింద్ ఎక్కడ తిరిగిన దాడులు జరపాలని టీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్యేలకు ఆదేశాలను ఇచ్చిందని అర్వింద్ ఆరోపించారు. దాడి వెనక టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగరరావు ఉన్నారని స్పష్టం చేశారు.
అరవింద్‌పై జరిగిన దాడిని హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొనే సత్తా లేక టీఆర్ఎస్ ఇలాంటి దాడులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేక దాడులకు దిగడం హేయమైన చర్య అంటూ ధ్వజమెత్తా రు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. ప్రజా క్షేత్రంలో టీఆర్ఎస్ నాయకులకు శిక్ష తప్పదని ఈటల హెచ్చరించారు.
అరవింద్‌పై టీఆర్ఎస్ నాయకులు చేసిన దాడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించాహరు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, సీఎం కేసీఆర్ నియంత వైఖరిని ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక భౌతిక దాడులకు తెగబడటం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మూమ్మాటికీ పిరికిపంద చర్య అని బండి సంజయ్ మండిపడ్డారు.
‘ప్రజాస్వామ్యవాదులంతా టీఆర్ఎస్ దుశ్చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని కోరుతున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. సీఎం కేసీఆర్ పాలనను, టీఆర్ఎస్ నేతల తీరును ప్రజల అసహ్యించుకుంటున్నారు. అయినా వారిలో మార్పు రాకపోగా ప్రశ్నించే వారిపై భౌతిక దాడులకు తెగబడటం వారి అవివేకానికి నిదర్శనం.టీఆర్ఎస్ నేతల బెదిరింపులకు, దాడులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రజా సమస్యలపై నిలదీస్తూనే ఉంటాం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరును కొనసాగిస్తూనే ఉంటాం’ అని స్పష్టం చేశారు.