న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీ చేపట్టకపోవడంతోనే కేసుల పరిష్కారానికి నోచుకోక పెండింగ్ పేరుకుపోతున్నాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు.
జైపూర్లో జరిగిన అఖిల భారత న్యాయసేవల అథారిటీస్ సమావేశంలో న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లేవనెత్తిన అంశాలకు ప్రస్తావిస్తూ న్యాయమూర్తులుగా తాము విదేశాలకు వెళ్లినా ఇదే ప్రశ్న అడుగుతుంటారని, ఓ కేసును పరిష్కరించేందుకు ఎన్నేళ్ల సమయం పడుతుందని అడుగుతుంటారని చెప్పుకొచ్చారు.
పెండింగ్ కేసులకు కారణమేమిటో మీ అందరికీ తెలుసని , దానిపై తాను సవివరింగా చెప్పాల్సిన పనిలేదని తెలిపారు. న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీ చేపట్టక పోవడంతో పాటు జ్యుడీషియల్ మౌలిక వసతులను మెరుగుపర్చకపోవడమే పెండింగ్ కేసులు పేరుకుపోడానికి కారణమని స్పష్టం చేశారు. ఇదే విషయం తాను గతంలో ప్రధాన న్యాయమూర్తులు ముఖ్యమంత్రుల సమావేశంలోనూ తేల్చి చెప్పానని గుర్తు చేశారు.
ఈ అంశాలను పరిష్కరించేందుకు న్యాయవ్యవస్థ శ్రమిస్తోందని, ప్రభుత్వం ఖాళీల భర్తీ, కోర్టుల్లో మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి సారించాలని జస్టిస్ రమణ కోరారు. జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీని ఏర్పాటు చేయాలని తాము సూచించామని , అయితే ఈ ప్రతిపాదన ఇంకా కార్య రూపం దాల్చలేదని విచారం వ్యక్తం చేశారు.
దేశంలోని కోర్టుల్లో విచారణ ప్రక్రియే పెద్ద శిక్షగా మారిందని చెబుతూ గడిచిన 27 ఏళ్లలో దేశంలోని 1,378 జైళ్లలో 6.1 లక్షల మంది ఖైదీలు ఉన్నారని, అందులో 80 శాతం మందిపై కేసులు విచారణ దశలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. విచక్షణా రహితంగా అరెస్ట్లు చేసి, పెద్ద పెద్ద నేరాలు మోపి బెయిలు అంత సులువుగా అందకుండా పరిస్థితులు మారిపోయాయని, దీనిపై శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు.
కోర్టు విచారణలకు ప్రముఖ న్యాయవాదులు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు వసూలు చేస్తే సామాన్యుడు ఎలా చెల్లించగలడని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. పేరొందిన న్యాయవాదులు అధిక ఫీజులు గుంజితే దేశంలో పేదలు, అణగారిన వర్గాలకు న్యాయం అందుబాటులో లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సుప్రీం కోర్టులో సాధారణ ప్రజలు భరించలేని విధంగా కొందరు న్యాయవాదులు ఫీజు వసూలు చేస్తారని గుర్తు చేశారు. హైకోర్టు సహా దిగువ కోర్టుల్లో వాదనలు, తీర్పులు స్థానిక భాషల్లో పెరిగేలా ప్రయత్నించాలని కిరణ్ రిజుజు సూచించారు. అయితే సుప్రీం కోర్టులో మాత్రం ఇంగ్లీషులో కొనసాగించుకోవచ్చని ఆయన చెప్పారు.
‘‘ప్రభుత్వానికి న్యాయవ్యవస్థకు మధ్య సత్సంభందాలు ఉండాలి. దాని వల్ల ప్రజలకు సత్వర న్యాయంతో పాటు మరింత ఎక్కువ న్యాయం జరుగుతుంది” అని తెలిపారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా ప్రసంగించారు.