ఎన్డిఎ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్ (71) పేరుని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్గా విధులు నిర్వహిస్తున్నారు. జగదీప్ ధన్కర్ పేరును ఖరారు చేస్తూ అధికారికంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డా ప్రకటన చేశారు.
వచ్చే ఏడాది జరగనున్న రాజస్థాన్ ఎన్నికల్లో జాట్ కమ్యూనిటీ ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు.
దీంతో జాట్ కమ్యూనిటీకి చెందిన జగదీప్ ధన్కర్ పేరుని ప్రకటించడంతో ఆ కమ్యూనిటీకి కీలక సందేశం పంపినట్లు కేంద్రం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన అభ్యర్థిత్వం ఖరారు చేసిన బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంకు ప్రధాని నరేంద్ర మోదీ, ప్రముఖ నేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ , నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరయ్యారు.
ధన్ఖర్ పరిపాలనాదక్షులు, రాజ్యాంగ విషయపరిజ్ఞానులు, చట్టసభల వ్యవహారాలతో సముచిత అనుభవజ్ఞులుగా ఉన్నారని, ఆయన అభ్యర్థిత్వానికి తమ మద్దతు అని ప్రధాని మోదీ ట్వీటు వెలువరించారు. రాజ్యసభ నిర్వాహక బాధ్యతల్లో ఆయన రాణిస్తారని ఈ నమ్మకం తనకు ఉందని తెలిపారు. జాతీయ ప్రగతి దిశలో సాగే పయనానికి ఆయన తమ వంతు సాయం అందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం బెంగాల్ గవర్నర్గా ఉన్న జగదీప్ ధన్కర్ 1951 మే 18న రాజస్థాన్లోని కుగ్రామంలో జన్మించారు. చిత్తోఢ్ఘడ్ సైనిక్ స్కూల్ నుంచి విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన.. రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు.
వృత్తిరిత్యా న్యాయవాది అయిన జగదీప్.. సుప్రీంకోర్టులో పలు కేసులు వాదించారు. రాజస్థాన్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ పనిచేశారు.
1989లో ధన్కర్ జనతాదళ్ తరఫున జున్ జునూ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. 1993 నుంచి 1998 వరకు కిషన్ఘడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 జులై 30న జగదీప్ ధన్కర్ పశ్చిమ బెంగాల్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. ఆయన చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్న దశలో కేంద్ర సహాయ మంత్రిగా కూడా ఉన్నారు.
ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవి కాలం ఆగష్టు 10వ తేదీతో ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 6వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాలి. నామినేషన్ల దాఖలుకు తుది గడువు జులై 19వ తేదీ.