దేశ ప్రజలకు 200 కోట్ల డోసుల మేర కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసిన దిశగా భారత్ రికార్డు నమోదు చేయనుంది. శనివారం వరకు దేశంలో 1,99,98,89,097 డోసుల వ్యాక్సిన్‌ను భారత ప్రభుత్వం పంపిణీ చేసింది. మరో 20.11 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేస్తే 200 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ పూర్తి కానుంది.
శనివారం ఒక్కరోజే 25,59,840 డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేసిన నేపథ్యంలో ఆదివారం 20.11 లక్షల డోసుల పంపిణీ సులువుగానే పూర్తి కానుంది. రికార్డు స్థాయిలో 200 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసిన దేశంగా భాతర్ రికార్డులకు ఎక్కనుంది. ఈ రికార్డు వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రత్యేక దృష్టి సారించింది.
కేంద్ర ఆరోగ్య మంత్రి మనుసుఖ్ మాండవీయ వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. 200 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ పూర్తి అయ్యే క్రమాన్ని తెలిపేలా సదరు వీడియోలో ఏర్పాట్లు చేశారు.
ఆదివారం ఉదయం 10.30 గంటల సమయానికే 6 లక్షలకు పైగా వ్యాక్సిన్లను పంపిణీ చేసినట్లుగా సదరు వీడియోలో స్పష్టమవుతోంది. సాయంత్రంలోగా మిగిలిన 14 లక్షల డోసుల వ్యాక్సినేషన్ కూడా పూర్తి కావడం ఖాయంగా కనిపిస్తుంది.
ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ అభినందనలు తెలిపారు.
‘భారత్ మళ్లీ చరిత్ర సృష్టించింది. 200 కోట్లు వ్యాకిన్లు వినియోగించినందుకు భారతీయులకు అభినందనలు. భారత్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను స్థాయిలో, వేగంతో అసమానంగా మార్చడానికి సహకరించిన వారందరికీ గర్వకారణం. కోవిడ్‌కి వ్యతిరేకంగా ప్రపంచ పోరాటాన్ని బలోపేతం చేసింది’ అని ట్వీట్ చేశారు.
నీతి అయోగ్ సభ్యుడు, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ అధినేత వికె పాల్ స్పందిస్తూ.. 2 బిలియన్ కోవిడ్ వ్యాక్సిన్ల వినియోగం భారత్ అద్భుతమైన మైలురాయిని సాధించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి కూడా ట్వీట్ చేశారు.