రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా సోమవారం ముగిసింది. పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ఓటెయ్యగా.. రాష్ట్రాల అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంటులో దాదాపు 99.18శాతం ఓటింగ్ నమోదైంది. రాత్రికి వివిధ మార్గాల ద్వారా బ్యాలెట్ బాక్సులను అసెంబ్లీల నుంచి ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్కు తరలింఛారు.
ఈ నెల 21న ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ ఎన్నికలో మెజార్టీ పార్టీలు ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకి మద్దతిచ్చాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, సమాజావాది పార్టీల సభ్యులు సహితం కొందరు ఆమెకు ఓట్ వేశారు. ఆమె 63 శాతానికి పైగా మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని సమాచారం.
పార్లమెంట్ హౌస్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ లో ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, మన్సుఖ్ మాండవీయ, హర్దీప్ సింగ్ పూరి, గజేంద్రసింగ్ షెకావత్, కిషన్ రెడ్డి ఓటేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీపీఈ కిట్ ధరించి పోలింగ్ లో పాల్గొన్నారు.
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహితం ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సమాజవాద్ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ లు వీల్ ఛైర్లో వచ్చి ఓటేశారు.