స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు కేవలం 6 పోర్టులుంటే, మనం ఏకంగా మరో 4 పోర్టులను అదనంగా నిర్మించబోతున్నామని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. అంటే ఈ ఐదేళ్లలో మరో 4 పోర్టులు- భావనపాడు, కాకినాడ గేట్వే పోర్టు, మచిలీపట్నం, రామాయపట్నం రానున్నాయని తెలిపారు. వీటి ద్వారా మరో 100 మిలియన్ టన్నుల కెపాసిటీ వస్తుందని చెప్పారు.
నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టు తొలి దశ నిర్మాణ పనులకు బుధవారం ఆయన భూమి పూజ చేసి ప్రారంభిస్తూ రాష్ట్రంలో ప్రస్తుతం కృష్ణపట్నం, కాకినాడలో 3, విశాఖపట్నం, గంగవరం ప్రాంతాల్లో పోర్టులు ఉన్నాయని, వీటిలో విశాఖపట్నం పోర్టు 70 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగి ఉంటే, మిగిలిన పోర్టుల కెపాసిటీ 158 మిలియన్ టన్నులు ఉన్నదని వివరించారు.
కొత్తగా వస్తున్న నాలుగు పోర్టులతో పాటు రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లు- బుడగట్లపాలెం, పూడిమడక, ఉప్పాడ, బియ్యపుతిప్ప, మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కొత్తపట్నం, జువ్వలదిన్నె నిర్మాణం జరుగుతోందని జగన్ తెలిపారు. పోర్టులకు సంబధించిన నిర్మాణ పనులు ఈ రోజు నుంచి వేగవంతం అవుతున్నాయని అంటూ మరో రెండు నెలల తిరక్కమునుపే మిగిలిన పోర్టులకు కూడా భూమి పూజ చేసి పనులు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, పోర్టు కానీ కనిపించేలా రాష్ట్రంలో వేగంగా అడుగులు పడుతున్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. 9 ఫిషింగ్ హార్బర్లు పూర్తయితే.. వీటి ద్వారా లక్ష మంది మత్స్యకార కుటుంబాలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు గుజరాత్ వంటి ప్రాంతాలకో, మరెక్కడికో పోవాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలోనే ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పారు.
కాకినాడ, మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం పోర్టుల్లో నేరుగా ఒక్కో దాంట్లో కనీసం 3 – 4 వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని జగన్ తెలిపారు. పరోక్షంగా పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలతో పాటు పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని, మొత్తంగా లక్షల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలకు నాంది పలుకుతున్నామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం వల్ల ఆయా ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతాయని ముఖ్యమంత్రి భరోసా వ్యక్తం చేశారు. పోర్టు రావడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని.. తద్వారా ఉద్యోగ అవకాశాలు విస్తృతమవుతాయని పేర్కొన్నారు.
జల రవాణా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఎగుమతి, దిగుమతులు వేగవంతం అవుతాయని చెప్పారు. తద్వారా రాష్ట్రానికి పలు విధాలా మేలు జరగడమే కాకుండా.. ఆయా ప్రాంతాల రూపురేఖలు మారతాయని జగన్ వివరించారు.