భారతదేశ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. దేశ అత్యున్నత పదవిని తొలిసారి ఓ ఆదివాసీ మహిళ అధిరోహించనుంది. భారత ప్రథమ పౌరురాలిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు.
అడవిలో పుట్టి అత్యున్నత పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్ము కొత్త చరిత్ర లిఖించారు. గతంలో ప్రతిభా పాటిల్ తొలి మహిళా రాష్ట్రపతిగా రికార్డు సృష్టించగా.. ఇప్పుడు ముర్ము తొలి ఆదివాసీ మహిళా రాష్ట్రపతిగా ఎన్నికై సరికొత్త అధ్యాయానికి తెర తీశారు. ఈ నెల 25వ తేదీన ఆమె అధికారికంగా ప్రమాణస్వీకారం చేస్తారు.
ఎన్నికల ఫలితాలు వెలువడగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డాతో కలసి స్వయంగా ముర్ము వద్దకు వెళ్లి ఆమెను అభినందించారు. గిరిజన సమాజానికి చెందిన బిడ్డ.. అత్యున్నత పదవికి ఎన్నికై చరిత్ర సృష్టించారని ఆయన కొనియాడారు. ద్రౌపది ముర్ము గెలుపు ప్రజాస్వామ్యానికి శుభసూచకం అని తెలిపారు.
“ఆమె అత్యుత్తమ రాష్ట్రపతిగా చరిత్రలో నిలుస్తారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ.. పౌరులకు ముఖ్యంగా పేదలు, అట్టడుగు, అణగారిన వర్గాలకు ఆశాకిరణంగా ఆమె ఉద్భవించారు. ద్రౌపది ముర్ము జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, సమాజానికి చేసిన గొప్ప సేవ, ఆదర్శప్రాయమైన జీవన ప్రయాణం ప్రతి భారతీయుడినీ ప్రేరేపిస్తాయి” అంటూ ప్రధాని చెప్పుకొచ్చారు.
మూడో రౌండు కౌంటింగ్ పూర్తయ్యే సరికి ద్రౌపది ముర్ము 50 శాతానికి పైగా ఓట్లు సాధించారు. దీంతో ఆమె విజయం లాంఛనమైంది. ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో దిగిన ముర్ము ప్రతి రౌండ్ లోనూ ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై స్పష్టమైన ఆధిక్యం సాధించారు.
ఓట్ల లెక్కింపు గురువారం చేపట్టారు. లెక్కింపు ముగిసిన వెంటనే రిటర్నింగ్ అధికారి పిసి మోడీ ముర్మును విజేతగా ప్రకటించారు. ముర్ముకు 2,824 (6,76,803) ఓట్లు రాగా, ప్రతిపక్షాలు బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 1,877 (3,80,177) ఓట్లు వచ్చాయి. దీంతో 2,96,626 ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు. మొత్తం 4,754 ఓట్లు పోల్ కాగా, అందులో 53 ఓట్లు చెల్లుబాటు కాలేదు. 4,701 ఓట్లు చెల్లుబాటు అయ్యాయని పిసి మోడీ తెలిపారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో దిగారు. ఈ నెల 18న ఓటింగ్ నిర్వహించగా, గురువారం పార్లమెంటు హౌస్లో ఓట్ల లెక్కింపు జరిపారు.
నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు పలువురు నేతలు అభినందించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హౌం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్సిపి అధ్యక్షుడు శరద్ పవర్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్జెడి నేత తేజశ్వీ యాదవ్, బిఎస్పి అధినేత మాయావతి, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా, తో పాటు ఇతర కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదతరులు ఆమెకు శుభాకాంక్షులు తెలిపారు.