జాతి ప్రయోజనాల కోసం పక్షపాత రాజకీయాలకు అతీతంగా ఎదగండని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం తన వీడ్కోలు ప్రసంగంలో రాజకీయ పార్టీలను కోరారు. ప్రజల సంక్షేమం కోసం ఏది అవసరమో నిర్ణయించండని సూచించారు.
పార్లమెంట్‌ను ప్రజాస్వామ్య దేవాలయమని సంభోదించిన కోవింద్ సభలో చర్చల సమయంలో గాంధేయ తత్వాన్ని వినియోగించాలని కోరారు. పార్లమెంట్లో చర్చ, అసమ్మతి తెలియజేసే సమయంలో ఎంపిలు ఎల్లప్పుడూ గాంధీ తత్వాన్ని అనుసరించాలని పేర్కొన్నారు.
పార్లమెంటరీ వ్యవస్థ పెద్ద కుటుంబంలాంటిదని చెబుతూ కుటుంబంలో భిన్నాభిప్రాయాలు సహజమే అన్నా రు. వీటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలని పార్టీలకు హితవు చెప్పారు. తమ వ్యతిరేకతను తెలపడానికి రాజకీయ పార్టీలు మహాత్మాగాంధీ అనుసరించిన శాంతి, అహింస మార్గాలు అనుసరించి లక్ష్యాలను సాధించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
ఆయన వ్యాఖ్యలకు సభలో ఉన్న ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య తదితరులు హర్షధ్వానాలు తెలిపారు. వివిధ ప్రభుత్వాలు చేసిన కృషి కారణంగా ఎంతో అభివృద్ధి జరిగిందని కోవింద్ చెప్పారు. తాను వర్షానికి నీరు కారే మట్టి ఇంటి నుంచి వచ్చానని తెలిపారు. ఇప్పుడు పేదలు పక్కా ఇళ్లలో ఉంటున్నారని, ఇందుకు కొంతవరకు ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని కొనియాడారు. అన్ని రంగాల్లో జరుగుతున్న అభివృద్ధితో అంబేడ్కర్ కలలు సాకారం అవుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతికి కోవింద్‌కు వీడ్కోలు పలికేందుకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గన్నారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు ఆయన అభినందనలు తెలిపారు.
కాగా, ద్రౌపది ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా సోమవారం (జులై 25)న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జులై 18న జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి అయిన ముర్ము.. ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పై ఘనవిజయం సాధించారు. దీంతో దేశ అత్యున్నత పదవిని అధిరోహించే తొలి ఆదివాసీ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా రాష్ట్రపతి పదవిని చేపట్టబోతున్న అత్యంత పిన్న వయస్కురాలు కూడా ఆమెనే కావడం విశేషం.