సాయుధ బలగాల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు త్రివిధ దళాల జాయింట్ థియేటర్ కమాండ్లను ఏర్పాటు చేయనున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. జమ్ము కశ్మీర్ పీపుల్స్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం జమ్మూలో నిర్వహించిన సాయుధ బలగా ల అమరవీరులకు నివాళి కార్యక్రమం ‘కార్గిల్ విజయ్ దివస్’లో పాల్గొంటూ దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడే క్రమంలో అమరులైన సైనికుల త్యాగాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోదని చెప్పారు.
కార్గిల్‌లో ఆపరేషన్ విజయ్‌లో చేపట్టిన సంయుక్త కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని జాయింట్ థియేటర్ కమాండ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఒకప్పుడు రక్షణ పరికరాలను దిగుమతి చేసుకునే అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ ఇప్పుడు ఎగుమతి చేసే దేశంగా ఎదిగిందని తెలిపారు.
మనదేశంపై చెడు దృష్టితో ఎవరు ఉన్నా వారికి తగిన సమాధానం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి హెచ్చరించారు ఏ యుద్ధంలోనైనా భారత్ గెలుస్తుందని దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్ (పిఒజెకె) గురించి మాట్లాడుతూ.. అది భారత్ లో భాగమేనని, భారత్ లోనే కొనసాగుతుందని అదే వైఖరికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
1947 నుంచి పాకిస్థాన్‌ను భారత్ ఓడిస్తూనే ఉందని, ఆ ఓటమి తరువాత పాక్ బూటకపు పరోక్ష యుద్ధాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. 1965, 1971ల్లో ప్రత్యక్ష యుద్ధాలలో పాక్ పరాజయాన్ని చవి చూశాక, భారత్‌లోకి చొరబడడానికి అనేక పన్నాగాలు పన్నుతోందని తెలిపారు.
కానీ మన వీర సైనికులు ధైర్యసాహసాలతో దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి ఎలాంటి నష్టం కలగకుండా తమ శౌర్యాన్ని ప్రదర్శిస్తున్నారని రక్షణ మంత్రి ప్రశంసించారు. పాక్, చైనాలతో యుద్ధాలు సంభవించినప్పుడు జమ్ముకశ్మీర్ ప్రజలు సైనికులతో ధైర్యంగా నిల్చున్నారని పేర్కొన్నారు.