దేశీయ, అంతర్జాతీయ భద్రతకు చైనా నెంబర్ వన్ ప్రమాదకారి అని బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి పోటీపడుతున్న భారత సంతతికి చెందిన మాజీ ఆర్ధిక మంత్రి రిషి సునాక్ హెచ్చరించారు. తాను ప్రధాని పదవి చేపడితే చైనాతో వ్యవహరించే తీరుపై వివరిస్తూ బ్రిటన్‌లోని 30 ఇన్స్టిట్యూట్లను మూసివేస్తామని, దాని ద్వారా సంస్కృతి, భాషా కార్యక్రమాల ద్వారా చైనా వ్యాప్తి చేస్తున్న సాఫ్ట్ పవర్ ప్రభావాన్ని అడ్డుకుంటామని వెల్లడించాయిరు.
‘మన యూనివర్సిటీల నుంచి చైనా కమ్యూనిస్ట్ పార్టీని తరిమికొడతాం. చైనా గూఢచర్యాన్ని అడ్డుకునేందుకు బ్రిటన్ డొమెస్టిక్ స్పై ఏజెన్సీ ఎంఐ5ని ఉపయోగిస్తాం. చైనా సైబర్ దాడులను అరికట్టేందుకు నాటో తరహా అంతర్జాతీయ సహకారాన్ని నిర్మిస్తాం. చైనా స్వదేశంలో మన సాంకేతికతను దొంగిలించి, మన విశ్వవిద్యాలయాలలోకి చొచ్చుకుపోతోంది’ అని స్పష్టం చేశారు.
రష్యన్ చమురును కొనుగోలు చేయడం ద్వారా విదేశాలలో వ్లాదిమిర్ పుతిన్‌కు చైనా మద్దతుగా నిలుస్తోందని, తైవాన్‌తో సహా పొరుగువారిని బెదిరించే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. అప్పులు ఆశ చూపి అభివృద్ధి చెందుతున్న దేశాలను తన అధీనంలోకి తెచ్చుకుంటున్న చైనా బెల్ట్ అండ్ రోడ్ పథకంపై తీవ్ర విమర్శలు చేశారు రిషి సునాక్.
అలాగే.. జింజియాంగ్, హాంకాంగ్‌లలో తన సొంత ప్రజలను వేధించటం, అరెస్టులు చేస్తూ మానవ హక్కులను చైనా కాలరాస్తోందని ఆరోపించారు. వారి కరెన్సీని తగ్గిస్తూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని రిషి తీవ్రంగా ధ్వజమెత్తారు.
“జరిగింది చాలు. చాలా కాలంగా బ్రిటన్‌తో పాటు పశ్చిమ ప్రాంతంలోని రాజకీయ నాయకులు చైనాకు ఎర్ర తివాచీ పరిచారు. చైనా కుటిల బద్ధిపై గుడ్డిగా వ్యవహరించారు. దానిని ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునే మారుస్తా” అని స్పష్టం చేసారు.
చైనా, రష్యా పట్ల రిషి సునాక్ బలహీనుడిగా ప్రత్యర్థి లిజ్ ట్రస్ ఆరోపణలు చేసిన క్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు మరోవైపు.. యూకే-చైనా సంబంధాల అభివృద్ధికి రిషి సునాక్ సరైన వ్యక్తి అని డ్రాగన్ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ఇటీవల పేర్కొనటం గమనార్హం.