ఆగష్టు 2 నుండి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర పోస్టర్ ను పార్టీ నేతలు ఆవిష్కరించారు. ఆగస్టు 2 నుంచి 26 వ తేదీ వరకు యాత్ర సాగనుందని తెలిపారు. ఆగస్టు 2న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది.
ఈ ప్రారంభ కార్యక్రమానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ను ఆహ్వానించినట్లు తెలిపారు. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని , వచ్చే నెల 26న జరిగే ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆహ్వానించామని చెప్పారు.
మొత్తం 24 రోజుల పాటు యాదాద్రి, నల్గొండ, జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల మీదుగా 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 మండలాల్లో సాగనుంది. మొత్తం 328 కిలోమీటర్ల మేర మూడవ విడత పాదయాత్ర కొనసాగుందని పార్టీ వర్గాలు తెలిపారు.
ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్, జనగామ, వర్ధన్నపేట, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగుతుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర చేనేత మంత్రిని ఆహ్వానిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.