రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ‘రాష్ట్రపత్ని’ అని అనుచితంగా ప్రస్తావించడం ద్వారా పార్లమెంట్ లోపల, బైట పెద్ద రాజకీయ దుమారం రేపడానికి కారకుడైన లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి క్షమాపణ కోరుతూ చివరకు రాష్ట్రపతికి లేఖ వ్రాసారు.
‘‘మీరు చేపట్టిన అత్యున్నత పదవి గురించి మాట్లాడుతూ పొరపాటున తప్పడు పదం వాడాను. దీనిపై విచారం వ్యక్తం చేసేందుకు ఈ లేఖ రాస్తున్నాను. నోరు జారడం వల్లే అలా జరిగింది. నన్ను క్షమించండి’’ అని అధీర్ రంజన్ చౌదరి తన లేఖలో పేర్కొన్నారు.
ఆయన వాఖ్యలకు బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధినేత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బిజెపి సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో రెండు రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం కలిగింది. దేశ వ్యాప్తంగా బిజెపి శ్రేణులు ఆందోళనలు జరిపారు.
దీనిపై తొలుత క్షమాపణ చెప్పేది లేదు, తాను తప్పుగా వ్యాఖ్యానించలేని బుకాయించిన అధిర్ రంజన్ చౌదరి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్దల జోక్యంతో దిగివచ్చారు. ఇక,. ‘‘మీరు కలిగి ఉన్న పదవిని వివరించడానికి పొరపాటున తప్పు పదాన్ని ఉపయోగించినందుకు చింతిస్తున్నట్లు నేను రాస్తున్నాను. ఇది నాలుక జారడం అని నేను మీకు హామీ ఇస్తున్నాను. నేను క్షమాపణలు కోరుతున్నాను. దానిని అంగీకరించ వలసిందిగా కోరుతున్నాను” అని కాంగ్రెస్ నేత అధిర్ తన లేఖలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ నేత, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ… అధీర్ రంజన్ చౌదరి పొరపాటున నోరు జారలేదని స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు రెండు సార్లు రాష్ట్రపతి అనే అన్నారని, తర్వాత కావాలనే రాష్ట్రపత్ని అన్నారని మంత్రి గుర్తు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను అంత తేలిగ్గా తీసిపారేయలేమని రిజిజు చెప్పారు.