ఎలాంటి న్యాయ సహాయం అందకుండా విచారణ దశలోనే అనేక మంది ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. వారిని విడుదల చేసేందుకు న్యాయ సహాయం అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వారిని త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
శనివారం ఢిల్లీలో జరిగిన ప్రథమ అఖిల భారత జిల్లా న్యాయ సేవా సంస్థల సదస్సులో ఆయన ప్రసంగిస్తూ జిల్లా స్థాయి అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ ఛైర్పర్సన్ హోదాలో విచారణ ఖైదీల విడులకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న జిల్లా జడ్జీలను కోరారు. 2020 నాటి క్రైం బ్యూరో రికార్డుల ప్రకారం దేశంలో 4,88,511 మంది ఖైదీలు ఉండగా వారిలో 76 శాతం మంది అంటే 3,71,848 మంది అండర్ ట్రయల్స్‌గా ఉన్నారని గుర్తు చేశారు.
సులభతర వాణిజ్యం, సులభతర జీవనం మాదిరిగానే సులభతర న్యాయం కూడా ప్రధానమైన విషయమేనని ప్రధాని మోదీ స్పష్టం చే శారు. గత ఎనిమిదేళ్లుగా కోర్టుల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.9వేల కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు తెలిపారు.న్యాయ వ్యవస్థ పనితీరు మెరుగుపడాలంటే అందుకు అడ్డుపడుతున్న అంశాలపై బహిరంగంగా చర్చించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. సమస్యలను దాచిపెట్టడం ద్వారా వాటిని పరిష్కరించలేమని, వాటిని సరైన సమయంలో పరిష్కరించకపోతే వ్యవస్థయే కుప్పకూలిపోతుందని హెచ్చరించారు.
సామాజిక న్యాయం కల్పించాలనే రాజ్యాంగ ఆకాంక్షను మనం నెరవేర్చలేకపోతున్నామేమోనని భయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల మాట్లాడడం, చర్చించడం, నిర్ణయించడం అవసరమని చెప్పారు. ఇదే సిద్ధాంతాన్ని తాను అనుసరిస్తున్నానని స్పష్టం చేశారు.
అండర్ ట్రయల్ ఖైదీలను త్వరగా విడుదల చేసేందుకు కృషి చేయాలన్న ప్రధాని చేసిన సూచనతో జస్టిస్ రమణ ఏకీభవించారు. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సదస్సులోనూ ప్రధానితో పాటు, అటార్నీ జనరల్‌లు ఈ సమస్యను ప్రస్తావించారని గుర్తు చేశారు. ఈ విషయంలో జాతీయ న్యాయ సేవా సంస్థ (నల్సా) ఇతర భాగస్వాములతో కలిసి చురుగ్గా పనిచేస్తోందని చెప్పారు.
ఖైదీ తరఫున సమర్థంగా వాదించేందుకు అంకితభావంతో ఉన్న న్యాయవాదులు అవసరమని చెప్పారు. తమ కక్షిదారుల పరిస్థితులు, అవసరాలను న్యాయవాదులు తెలుసుకోవాలని, తరచూ జైళ్లకు వెళ్లాలని, ఖైదీల కుటుంబాలకు అందుబాటులో ఉండాలని సూచించారు.