జయలలిత మంత్రివర్గంలో ఆమెకు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరొంది, ఆమె రాజీనామా చేయవలసి వచ్చినప్పుడు తన స్థానంలో ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితులు ఎదురుకొంటున్నారు.
ఒక వంక, అన్నాడీఎంకేలో తగు బలం సమీకరించేయలేక పోవడంతో పార్టీ నుండి బహిష్కరణకు గురయ్యారు.
పార్టీ ప్రధాన కార్యాలయంతో పాటు మొత్తం పార్టీ వ్యవహారాలు మరో మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఆధిపత్యంలోకి వెళ్లాయి. మరోవంక, న్యాయస్థానాల నుండి, ఎన్నికల కమీషన్ నుండి వరుసగా ఎదురు దెబ్బలు ఎదురవుతున్నాయి. ఎడపాడి నేతృత్వంలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశం, తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చెల్లదు..అని ఆదేశించాలని కోరుతూ వేసిన అప్పీల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
పైగా మద్రాసు హైకోర్టులోనే ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాలని ఆదేశించడం,అప్పటి వరకు అన్నాడీఎంకేలో యథాతధ స్థితి కొనసాగుతుందని స్పష్టం చేయడం ఓపీఎస్‌కు మింగుడుపడలేదు. అయితే, అన్నాడీఎంకే వ్యవహారంపై 3 వారాల్లోగా తీర్పు చెప్పాలని కూడా మద్రాసు హైకోర్టును ఆదేశించింది.
ఈ మేరకు ఆగస్టు 1వ తేదీన విచారణ ప్రారంభం కానుండగా, సుప్రీంకోర్టు ఆదేశాలను అధిగమించి చేపట్టాల్సిన తదుపరి చర్యలపై తన మద్దతుదారులు, చట్ట నిపుణులతో ఓపీఎస్ శనివారం సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. ఇక అన్నాడీఎంకేలో కుమ్ములాటలు ఇలా ఉండగా, శశికళ, పన్నీర్‌సెల్వం ఏకమై రాజకీయంగా ముందుకు సాగాలని వంద దేవర్ సంఘాల ప్రతినిధులు వారిద్దరికీ శనివారం లేఖలు పంపడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం అన్నాడీఎంకే బహిష్కృత నేత ఒ. పన్నీర్‌సెల్వంకు ఝలక్ ఇచ్చింది. సోమవారం జరిగే అఖిలపక్ష సమావేశానికి ఆయనకు ఆహ్వానం పంపకుండా, అన్నాడీఎంకే తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికైన ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)కి మాత్రమే పంపింది. దీంతో ఎన్నికల కమిషన్ కూడా ఈపీఎస్‌ను పార్టీ అధినేతగా గుర్తించినట్లయింది.
అన్నాడీఎంకే ఉపసమన్వయకర్తగా వున్న ఈపీఎస్‌ను తొలగించి, ఆ స్థానంలో సీనియర్ నేత వైద్యలింగంను నియమించినందున అఖిలపక్ష సమావేశానికి తమనే ఆహ్వానించాలని కోరుతూ ఓపీఎస్ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఈసీకి లేఖ రాశారు. తమ గ్రూపునే అసలైనదిగా గుర్తించి, తమకు ఆహ్వానం పంపాలని అభ్యర్థించినా ప్రయోజనం లేకపోయింది.