రూ 1,50,173 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌లు అమ్ముడవడంతో భారతదేశపు అతిపెద్ద ఎయిర్‌వేవ్ వేలం ఆగస్టు 1న ముగిసింది. ఏడు రోజుల పాటు సాగిన వేలం ఈ రోజు మధ్యాహ్నంతో ముగిసినట్లు అభిజ్ఞ వర్గాలు తెలిపాయి.
విక్రయాల ద్వారా వచ్చిన తాత్కాలిక సొమ్ము(ప్రావిజినల్ సేల్ అమౌంట్) రూ. 1,50,173 కోట్లు కాగా తుది లెక్కింపు ఇంకా జరుగుతోందని వారు తెలిపారు. భారతదేశంలో 5జి సేవలకు మద్దతిచ్చే స్పెక్ట్రమ్ వేలం జూలై 26న ప్రారంభమైంది. తొమ్మిది బ్యాండ్ల క్రింద సుమారు 72,000 MHz 20 సంవత్సరాల చెల్లుబాటు వ్యవధితో విక్రయించారు.
చివరి రోజున నాలుగు రౌండ్ల వేలం పూర్తయిందని, దరఖాస్తుదారుల నుండి “బలమైన బిడ్లు” వచ్చాయని మంత్రి వైష్ణవ్ తెలిపారు. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, అదానీ డేటా అనే నలుగురు బిడ్డర్లు పోటీలో ఉన్నారు. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో బిడ్లలో అత్యంత దూకుడు ప్రదర్శించగా, సునీల్ భారతి మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎయిర్టెల్ తర్వాతి స్థానంలో ఉంది.
ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో రూ.88,078 కోట్ల విలువ చేసే స్పెక్ట్రం కోసం బిడ్డింగ్ వేసింది. సునీల్ మిట్టల్‌కు చెందిన భారతీ ఎయిర్టెల్ 19,867 మెగాహెడ్జ్ సహా ఇతర బ్యాండ్ల కోసం రూ.43,084 కోట్ల విలువ చేసే బిడ్డింగ్‌లు వేసింది. వొడాఫోన్ ఐడియా రూ.18,784 కోట్ల విలువ చేసే స్పెక్ట్రం కొనుగోలుకు ముందుకు వచ్చింది. అదానీ గ్రూపు కేవలం రూ.212 కోట్ల స్పెక్ట్రం కోసం మాత్రమే బిడ్డింగ్ వేయడం విశేషం,
10 బ్యాండ్లలో 72,098 మెగాహెడ్జెస్ స్పెక్ట్రానికి వేలం నిర్వహించింది. ఇందులో 51,236 మెగాహెడ్జెస్ లేదా 71 శాతం అమ్మేశారు. 5జి బ్యాండ్లు అయినా 3300 ఎంహెచ్‌జడ్, 26 ఎంహెచ్‌జడ్, 26జిహెచ్జడ్కు మాత్రం మూడింట రెండొంతుల బిడ్లు వచ్చాయి. తొలి ఏడాది రూ.13,365 కోట్ల రెవెన్యూ రానుందని వైష్ణవ్ తెలిపారు. అక్టోబర్‌లో 5జి సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు.
వేలం ప్రక్రియ తొలి రోజు ఏకంగా రూ.1.45 లక్షల కోట్ల విలువైన బిడ్లకు దాఖలు రాగా.. మిగితా ఆరు రోజుల్లో కేవలం రూ.6వేల కోట్ల లోపే బిడ్లు నమోదుకావడం గమనార్హం. 72,098 మెగాహెడ్జెస్ స్పెక్ట్రాన్ని వేలానికి పెడుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. వీటి కనీస విలువ రూ.4.31 లక్షల కోట్లుగా ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా.. తాజా బిడ్డింగ్ గణంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తం స్పెక్ట్రంలో 71 శాతం విక్రయించినప్పటికీ.. ప్రభుత్వ అంచనాల్లో కనీసం సగానికి చేరకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయపడుతున్నారు. ఈ దఫా వేలంలోనూ టెల్కోలు అతి చౌకగా స్పెక్ట్రాన్ని దక్కించుకున్నారని విశ్లేషిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానకు భారీగా గండి పడి ఉండొచ్చని తెలుస్తోంది.