పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కుంభకోణంలో అరెస్ట్ అయి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులతో కలసి ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్న పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి, సస్పెన్షన్‌కు గురైన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు పార్థా చటర్జీపై అంటాలా ప్రాంతంలో ఒక మహిళ చెప్పు విసిరింది. అయితే ఆమె విసిరిన చెప్పు చటర్జీని తాకకుండా పక్కన పడింది.
చటర్జీకి అత్యంత సన్నిహితురాలైన అర్పిత ముఖర్జీకి చెందిన రెండు అపార్ట్మెంట్లలో ఇటీవల రూ. 50 కోట్ల నగదు, భారీ మొత్తంలో బంగారు నగలను ఇడి అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అవినీతికి పాల్పడిన చటర్జీపై ఆగ్రహంతోనే తానీ చర్యకు పాల్పడినట్లు మధ్యవయస్కురాలైన శుభ గౌరీ అనే మహిళ విలేకరులకు తెలిపింది.
చటర్జీని చెప్పుతో కొట్టాలనే తాను ఇక్కడకు వచ్చానని, ఉద్యోగం లేకుండా ప్రజలు రోడ్ల మీద తిరుగుతుంటే పార్థా చటర్జీ మాత్రం అపార్ట్మెంట్ తర్వాత అపార్ట్మెంట్ కట్టుకుంటూ భారీ మొత్తంలో డబ్బును కూడబెట్టుకోవడాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఆమె చెప్పారు.
ప్రజలు మోసం చేసి అతను ఎసి కార్లలో తిరుగుతున్నాడని, అతడిని తాడుతో ఈడ్చుకువెళ్లాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెప్పుల్లేకుండా ఇంటికి నడుచుకెళ్లిపోతానని, ఇది తన ఆగ్రహం మాత్రమే కాదు..లక్షలాది బెంగాల్ ప్రజల ఆగ్రహమని ఆమె చెప్పారు.
ఆ డబ్బు తనది కాదంటున్న అర్పిత
మరోవంక, తన నివాశాలలో దొరికిన సుమారు రూ 50 కోట్ల నోట్ల కట్టలు, కేజీల కొద్దీ బంగారం నగలు తనవి కాదని, తాను లేనప్పుడు ఎవరో తన ఫ్లాట్లలో పెట్టి ఉంటారని అర్పిత ముఖర్జీ ఆరోపించారు. వైద్య పరీక్షల కోసం అర్పితాను ఈడీ అధికారులు ఆసుపత్రికి మరోసారి తీసుకువచ్చిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు శాంతినికేతన్లో 2012లో 20 లక్షలకు కొనుగోలు చేసిన ఫామ్ హౌస్‌ను పార్థా చటర్జీ అర్పితకు రాసిచ్చేశారు. ఇది ఈడీ దాడుల్లో వెలుగులోకి వచ్చింది. ఈ ఫామ్‌హౌస్‌కు అపా అని పేరు పెట్టారు. అ అంటే అర్పిత, పా అంటే పార్థా చటర్జీ అని అర్థం వచ్చేలా పేరు పెట్టారు. తరచూ ఇద్దరూ ఈ ఫామ్‌హౌస్‌కు వస్తుంటారని స్థానికులు తెలిపారు.
అర్పిత పేరిట ఉన్న అనేక ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఈ ఫామ్‌హౌస్‌లోనే ఈడీ అధికారులకు దొరికాయి. అంతకు ముందు ఆ నోట్ల కట్టలతో తనకు సంబంధం లేదని, ఇదంతా ఎవ్వరో తనను కుట్రపూరితంగా ఇరికిస్తున్నారని పార్థసారథి ఆరోపించడం గమనార్హం.