ఉపఎన్నిక వస్తేనే సీఎం కేసీఆర్ అభివృద్ధి మంత్రం జపిస్తున్నారని, అందుకే తాను రాజీనామా వైపు అడుగు వేశానని కాంగ్రెస్ ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వెల్లడించాయిరు. మునుగోడు ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన మంగళవారం సాయంత్రం ప్రకటించారు.
మాటలు పడి,నిందలు మోసి, ఆత్మగౌరవం లేకుండా పదవిలో కొనసాగాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసిన ఆయన.. ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉప ఎన్నిక వస్తే ఎవరిని గెలిపించాలన్నది ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసమే తాను ఈ పోరాటం చేయనున్నట్లు చెప్పారు.
మునుగోడు ఎమ్మెల్యే హోదాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చివరిసారిగా మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ “మునుగోడు నియోజకవర్గం గురించి.. గత పది పన్నెండు రోజులుగా మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో రాజీనామాపై చర్చ జరుగుతోంది. దీంతో నా రాజీనామాపై చర్చ పక్కదారి పట్టింది. నా గురించి కొందరు తప్పుగా మాట్లాడుతున్నారు. అయినా రాజీనామాపై నాన్చే ఉద్దేశం నాకు లేదు” అని స్పష్టం చేశారు.
మోదీ పాలన గురించి మూడేళ్ళుగా ఆలోచించినట్లు చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్రంలో మూడోసారి కూడా మోదీ సర్కార్ అధికారంలోకి వస్తదని ధీమా వ్యక్తం చేశారు. తన రాజకీయ భవిష్యత్తుపై స్పందించిన ఆయన ఏ పార్టీలో ఉంటే ప్రజలకు బాగుంటుందో అదే పార్టీలో చేరతానని తెలిపారు. బీజేపీలో చేరే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అయితే రాష్ట్రంలో అరాచక పాలన పోవాలంటే మోదీ, అమిత్ షా వల్లే సాధ్యమవుతుందని రాజగోపాల్ స్పష్టం చేశారు.
మునుగోడు ప్రజల నిర్ణయం మేరకే తన నిర్ణయం ఉంటుందని చెబుతూ మునుగోడులో అసలు అభివృద్ధి లేదని, ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. కనీసం ప్రతిపక్ష ఎమ్మెల్యే హోదాలో కూడా తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని ధ్వజమెత్తారు.
కేసీఆర్ పోడు భూముల సమస్యలపై ప్రభుత్వం ఇంతవరకూ ఏమీ చేయలేదని, గిరిజనులను అధికారులు వేధిస్తున్నారని మండిపడ్డారు. పోడు భూములకు పాస్ బుక్లు ఇప్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాగా, ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఎమ్మెల్యే పదవి త్యాగం చేసి.. టీఆర్ఎస్ అభ్యర్థినే తాను గెలిపిస్తానని టీఆర్ఎస్కు చెప్పానని, అయినా ఎటువంటి పురోగతి లేదని రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం బలహీనపడడం కూడా తన రాజీనామాకు ఓ కారణమని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ లో కొనసాగమని అంటున్నారని, అయితే కేసీఆర్ ను ఢీకొట్టడం ఆ పార్టీ వల్ల కాదని స్పష్టం చేశారు. తనపై చర్యలు తీసుకుంటామంటున్న నేతలు తాను చేసిన తప్పేంటో చెప్పాలని నిలదీశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుడి కింద పని చేయడం తన వల్ల కాదని తేల్చి చెప్పారు. తెలంగాణ కోసం ఎవరు కష్టపడితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎవరి వశమైందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తనను మునుగోడు ప్రజలు ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించారని, కానీ, నియోజకవర్గానికి ఏం చేయలేక పోయానన్న అసంతృప్తి తనలో పేరుకుపోయిందని చెప్పారు. రాజీనామా చేస్తేనే ఇక్కడ అభివృద్ధి, కనీస వసతులైనా కలగవచ్చని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
