’’మూసీ నదిని రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రక్షాళన చేస్తానని, హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్లలా మారుస్తానని హామీలిచ్చిన మాటలు ఏమయ్యాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన కోసం కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయని నిలదీశారు.
ప్రజా సంగ్రామ యాత్ర నాలుగోరోజున, మూసీ బాధిత ప్రాంతమైన భువనగిరి నియోజకవర్గం పెద్ద రావులపల్లి గ్రామస్తులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో స్థానిక ప్రజలు మూసీ నీటితో పడుతున్న కష్టాలను ఏకరవు పెడుతూ మూసీ నీళ్ల వల్ల తినే తిండి కూడా కలుషితమైపోయిందని వాపోయారు. తమ ప్రాంతాల్లో పెళ్లి చేసుకుందామంటే పిల్లను కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మూసీ నీళ్లతో పంటలన్నీ నాశనమవుతున్నాయని, అరోగ్యం దెబ్బతిని చావు బతుకుల మధ్య బతుకు వెళ్లదీయాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. వారి బాధలు విని చలించిన సంజయ్ మూసీ నీళ్ల వల్ల ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నా కేసీఆర్ లో చలనం ఎందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2002లో నాడు కేంద్రంలో హోమ్ మంత్రిగా ఎల్ కె అద్వానీ మూసీ ప్రక్షాళన కోసం రూ.344 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. కేసీఆర్ వచ్చాక మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రూ.4000 కోట్లు కేటాయిస్తాం అని చెప్పారని, కానీ ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు పడలేదని ధ్వజమెత్తారు.
కేసీఆర్ 300 ఎకరాల ఫార్మ్ హౌస్ కు 200 కీమో దూరం ఉన్న కాళేశ్వరం నుంచి నీళ్లు రప్పించుకోవడానికి లక్షా 30వేల కోట్లు ఖర్చు చేశాడని, కానీ మిగిలిన ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్రం నుంచి వివిధ పథకాల కింద భారీ ఎత్తున పెద్దరావులపల్లికి నిధులను కేటాయించారని చెబుతూ పరిశ్రమల వ్యర్థాలను మూసీలో కలుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు, రైతులు మూసీ వెదజల్లే కాలుష్యం కారణంగా, పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. మూసీ రివర్ బోర్డు కార్పొరేషన్ ఫేరు పెట్టి వేల కోట్ల రుణాల తెచ్చి ఏం చేశారో కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేదల కోసం తెలంగాణకు మోడీ 2 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే…. కేసీఆర్ వాటిని కట్టించడం లేదని చెప్పారు.
“ఉచితంగా 5 కిలోల బియ్యం, ఫ్రీ వ్యాక్సిన్ మోదీ ఇస్తున్నారు. మోదీ ఇచ్చే కిలో బియ్యంపై రూపాయి చొప్పున కేసీఆర్ డబ్బులు వసూలు చేశాడు. కేసీఆర్ తన కుటుంబానికే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఉపాధిహామీ పథకం కింద రోజుకు రూ.257 మోడీ ఇస్తున్నారు… ఎండాకాలం అదనంగా రూ.20 ఇస్తున్నారు. నిధులు మోదీ ఇస్తున్నా… వాటిని కేసీఆర్ ఇక్కడ పంపించలేదు. ..” అంటూ విమర్శల వర్షం కురిపించారు.