కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఎమ్యెల్యే కోటమిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ ఈనెల 21న మునుగోడులో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరతారని బిజెపి ఎమ్యెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. రాజగోపాలరెడ్డి శుక్రవారమే ఢిల్లీలో హోమ్ మంత్రి అమిత్ షాను కలసి ఈ నెల 21న బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
అదేవిధంగా, ఇటీవల టిఆర్ఎస్ కు రాజీనామా చేసిన సిద్దిపేట మురళీయాదవ్, రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావులు కాషాయ కండువా కప్పుకుంటారని చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కనుమరుగవుతోందని పేర్కొంటూ, త్వరలోనే టీఆర్ఎస్ కూడా ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. రెండు క్రితమే కనీసం 12 మంది టిఆర్ఎస్ ఎమ్యెల్యేలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని, మునుగోడు తర్వాత వారి నియోజకవర్గాలలో సహితం ఉపఎన్నికలు వస్తాయని బిజెపి రాష్ట్ర బండి సంజయ్ ప్రకటించారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ఇనుప కంచె వేశాడని ఈటెల ఆరోపించారు. పెన్షన్ కూడా ఇప్పించలేని పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రులు ఉన్నారని పేర్కొన్నారు. హుజురాబాద్లో ఓ టీఆర్ఎస్ నాయకుడు చిల్లర వేషాలు వేస్తున్నాడని.. ప్రజలే అతడికి తగిన బుద్ధి చెప్తారని మండిపడ్డారు.
గురుకులాలతో పాటు కస్తూర్బ బాలిక విద్యాలయాలు సహా బాసర ట్రిపుల్ ఐటీలో నాణ్యమైన ఫుడ్ పెట్టడం లేదని ఈటల ఆరోపించారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అనే వార్తలు ఎప్పుడు వినాల్సి వస్తుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతుని చెప్పారు.
కేసీఆర్ మనవడు తిన్న ఫుడ్ గురుకులాల్లో పెడుతున్నామని చెప్తున్నారని అంటూ కేసీఆర్ మనవడిని కొన్ని రోజులు గురుకులాలకు పంపాలని ఎద్దేవా చేశారు. గురుకులాల్లో పెట్టే ఆహరంతో బావితరాలు ఎలా ఆరోగ్యంగా ఉంటారని ఆయన ప్రశ్నించారు. గురుకులాల టీచర్లతో కేసీఆర్ వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఈటల ఆరోపించారు.
గురుకులాలు, బాసర ట్రిపుల్ ఐటీకి వెళదామంటే పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని. అయినా కేసీఆర్ ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు .