* 50వ వార్షికోత్సవం
డిసెంబర్ 16 భారతదేశానికి, పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్తాన్లకు కీలకమైన చారిత్రాత్మక రోజు. 1971లో, బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్తాన్) పుట్టుకకు దారితీసిన పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారతదేశం ఘన విజయం సాధించింది.
సరిగా 50 ఏళ్ళ క్రితం ఈ రోజున, పాకిస్తాన్ తన దేశంలో సగం భూభాగాన్ని కోల్పోయింది. తూర్పున తన బలగాలను కోల్పోయింది. పైగా భారతదేశానికి బహిరంగంగా లొంగిపోవాల్సి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద సైనిక లొంగుబాటు కూడా ఇదే కావడం గమనార్హం.
ఒక సారి చైనాతో, పలు సార్లు పాకిస్థాన్ తో యుద్దాలు జరిగినా గతం 75 ఏళ్ళల్లో భారత్ సైన్యం నిర్ణయాత్మక విజయం సాధించిన యుద్ధం ఇదొక్కటే కావడం గమనార్హం. పైగా అమెరికా, బ్రిటన్ వంటి అగ్ర రాజ్యాలు కన్నెర్ర చేసినా, బహిరంగంగా హెచ్చరించినా భారత్ వాటిని లెక్క చేయకుండా యుద్ధంలో ముందుకు వెళ్ళింది.
మిగిలిన యుద్దాలు అన్ని అమెరికా, రష్యా వంటి దేశాల జోక్యంతోనో, గెలుపొందలేమనో ఏకపక్షంగా శత్రు సైన్యం తోకముడవడంతో ఆగిపోయాయి.
త్రివిధ దళాల ఉమ్మడి పోరాటం
మరోవంక, త్రివిధ దళాలు ఉమ్మడిగా పోరాటాలకు సిద్ధం కావాలని ఇటీవల భారత ప్రభుత్వం చీఫ్ అఫ్ డిఫెన్సె సర్వీసెస్ ను ఇటీవల మృతి చెందిన జనరల్ బిపిన్ రావత్ తో ఏర్పాటు చేసింది. అయితే అటువంటి ఏర్పాటు లేకపోయినా ఈ యుద్ధంలో త్రివిధ దళాలు కలసి మొదటి సారిగా పోరాటం చేయడం మరో ప్రత్యేకత.
11 భారత వైమానిక స్థావరాలపై పాకిస్థాన్ వైమానిక దాడులు చేయడంతో యుద్ధం ప్రారంభమైంది. పశ్చిమాన పాకిస్తాన్ సైన్యం కదలికలకు భారతదేశం సత్వరమే స్పందించింది. దాదాపు 15,010 కిలోమీటర్ల పాకిస్తాన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది.
దానితో గత్యంతరం లేక పాకిస్తానీ దళాల అధిపతి జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ, 93,000 మంది సైనికులతో కలిసి భారత సైన్యం, బంగ్లాదేశ్‌కు చెందిన ముక్తి బహినీ సంయుక్త దళాలకు లొంగిపోవడంతో యుద్ధం ముగిసింది.
జనరల్ ఎఎకె నియాజీ డిసెంబర్ 16, 1971న ఢాకాలో సరెండర్ ఇన్‌స్ట్రుమెంట్‌పై సంతకం చేశారు. ఇది బంగ్లాదేశ్ కొత్త దేశంగా తూర్పు పాకిస్తాన్ ఏర్పడటానికి దారితీసింది. యుద్ధం కేవలం 13 రోజులు మాత్రమే కొనసాగింది. ఇది చరిత్రలో అతి చిన్న యుద్ధాలలో ఒకటి. కానీ చరిత్ర గతినే మార్చివేసింది.
భారతదేశం, పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణ 3 డిసెంబర్ 3, 1971 నుండి డిసెంబర్ 15, 1971 న డాకా పతనం వరకు జరిగింది. భారత సైన్యం ముందు పాకిస్తానీ సైన్యాన్ని మోకరిల్లింది. 93,000 మంది పాకిస్తానీ ఖైదీలను మన సైన్యం పట్టుకోండి. 7.5 కోట్ల మంది బంగ్లాదేశ్ ప్రజలకు స్వాతంత్య్రం పొందేందుకు కారకులయ్యారు.
తూర్పు పాకిస్తాన్‌లోని బెంగాలీ జనాభాపై పాకిస్తాన్ నిర్వహిస్తున్న మారణహోమాన్ని అంతం చేయడానికి జరిగిన ఈ యుద్ధంలో భారతదేశం, పాకిస్తాన్లకు చెందిన 3,800 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
బద్దలైన పాక్ పుట్టుక నేపధ్యం
ఎటువంటి భౌగోలిక, చారిత్రక నేపధ్యం లేకుండా, కేవలం బ్రిటిష్ పాలకుల కుట్రలో భాగంగా మతం ప్రాతిపదికన ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా పాకిస్థాన్ ఆవిర్భవించింది. ముస్లింలు అధికంగా గల ప్రాంతాలతో పాకిస్థాన్ ఏర్పడింది. అటువంటి దేశం 24 ఏళ్ళు కూడా కలసి ఉండలేక పోవడం, సగ భాగం దేశం నుండి విడిపోయి మరో దేశంగా ఏర్పడడంతో పాక్ పుట్టుక నేపధ్యమే బద్దలైనది.
పాకిస్థాన్ ప్రభుత్వంలో పశ్చిమ వైపున ఉన్న ముస్లింల ఆధిపత్యం కొనసాగడం, తూర్పు ప్రాంతంలో ఉన్న బెంగాలీ మాట్లాడే ముస్లింల పట్ల వివక్షతతో వ్యవహరించడంతో అక్కడ విముక్తి పోరాటం, తిరుగుబాటు ప్రారంభమై ఈ యుద్దానికి దారి తీసింది
బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్తాన్) (పశ్చిమ) పాకిస్తాన్ నుండి విముక్తి కోసం పోరాడుతున్నప్పుడు బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం ఫలితంగా ఈ సంఘర్షణ జరిగింది. పాక్ సేనలు సాగించిన మారణ హోమంలో 30 లక్షల మందిని చంపేశారని.. 4 లక్షల మంది మహిళలపై అత్యాచారాలు చేశారని బంగ్లాదేశ్ అధికార వర్గాల నివేదిక చెబుతోంది.
ముజిబుర్ రహమాన్‌ను 26వ తేదీ తెల్లవారుజామున అరెస్టు చేయడాన్ని జీర్ణించుకోలేక బెంగాలీలు ఎక్కడికక్కడ తిరగబడ్డారు.
ముజిబుర్ రహమాన్ తరఫున తూర్పు బెంగాల్‌కు స్వాతంత్య్రం ప్రకటిస్తున్నట్లు మేజర్ జియావుర్ రహ్మాన్ 26వ తేదీన రేడియోలో ప్రకటించారు.
దీంతో సైనికులు మరింత రెచ్చిపోయి.. ఆ రేడియో స్టేషన్‌ను ధ్వంసం చేసి అణచివేతను తీవ్రతరం చేశారు. తిరుగుబాటుదారులను పెద్దసంఖ్యలో అరెస్టు చేశారు. బెంగాల్‌లోని మైనారిటీ హిందువులను ఊచకోత కోశారు. పాకిస్తాన్ దుశ్చర్యలు పెరగడంతో, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పాకిస్తాన్‌పై చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ముందుకు రాని ప్రపంచ దేశాలు
తూర్పు బెంగాల్లో హింస నానాటికీ తీవ్రమవుతుండడంతో.. సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని ఇందిర ప్రపంచ దేశాలకు అంతకుముందు నుంచే పదే పదే విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. అయినా అమెరికా, సోవియట్ యూనియన్, చైనా, ముస్లిం దేశాలు సహా ఏ దేశం ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో 1971 మార్చి 27న తూర్పు బెంగాలీల స్వాతంత్య్ర ఉద్యమానికి ఇందిరాగాంధీ బహిరంగంగా మద్దతు ప్రకటించారు.
ఆ తర్వాత మంత్రివర్గంతో చర్చించి పాకిస్థాన్‌తో యుద్ధంచేసి తూర్పు బెంగాల్‌కు విముక్తి కల్పించడం మంచిదని నిశ్చయానికి వచ్చారు. 1971 ఏప్రిల్ 28న జనరల్ శామ్ మానెక్ షాను పిలిపించి మాట్లాడారు. ఆయన కొంత సమయం అడిగితే.. ఇందిర అంగీకరించారు. పాక్‌లో అధ్యక్షుడు యాహ్యాఖాన్ నవంబరు 23న ఎమర్జెన్సీ విధించారు. యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు.
పాక్ సైన్యం సాగించిన అత్యాచారం, చిత్రహింసలు, హత్యలు, దాడుల కారణంగా 80 లక్షల నుండి కోటి మంది ప్రజలు ప్రాణభయంతో భారతదేశంలో ఆశ్రయం పొందేందుకు వలస వచ్చారు. తూర్పు పాకిస్తాన్ నుండి నిరంతర శరణార్థుల ప్రవాహం కారణంగా దేశం అప్పటికే భారాన్ని ఎదుర్కొంటోంది.
అందుకనే, యుద్ధంలోకి ప్రవేశించడం అంటే మరింత భారాన్ని ఆహ్వానించడమే కాగలదని తొలుత పాకిస్తాన్‌పై పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రారంభించేందుకు ఇందిరా గాంధీ ఇష్టపడలేదు. పరిస్థితులను సరిదిద్దెందుకు సహకరించ వలసింది పోయి అమెరికా వంటి దేశాలు పాకిస్థాన్ కు బాసటగా నిలిచి, భారత్ పట్ల బెదిరింపు ధోరణి అనుసరించడంతో ఎక్కువ సమయం లేక భారత ప్రభుత్వం త్వరగా స్పందించాల్సిన అవసరం వచ్చింది.