భారత ఉప రాష్ట్రపతి గా జగ్దీప్ ధన్కర్ విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్కరెట్ అల్వాపై 346 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి తరఫున ఎన్నికల బరిలో నిలిచిన జగదీప్ ధన్కర్కు 528 ఓట్లు, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు పోలయ్యాయి.
15 ఓట్లు చెల్లకుండా పోయాయి. ధన్కర్ గెలుపును లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికలో పార్లమెంట్‌కు చెందిన 725 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. మరో ఎనిమిది ఎంపీ స్థానాలు ఖాళీగా ఉండటంతో ఓటింగ్‌కు అవకాశం లేకుండా పోయింది.
విపక్షంలో ప్రధాన పార్టీఅయిన తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఓటింగ్‌కు గైర్హాజరు అయింది. దీనితో ఆది నుంచి విజేత ఎవరనేది ఏకపక్షంగా సాగింది. మొత్తం పోలయిన ఓట్లతో పోల్చుకుంటే ధన్కర్కు 70 శాతానికి పైగా ఓట్లు పడ్డాయి. వెంకయ్యనాయుడు ఎన్నిక దశలో ఆయన సాధించిన మెజార్టీని ఈసారి ధన్కర్ తోసిరాజన్నారు.
ఓ వైపు ఓట్ల లెక్కింపు జరుగుతున్న దశలోనే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ నివాసం వద్ద ధన్కర్ అక్కడ ఉన్నప్పుడువిజయనేపథ్యంలో కార్యకర్తలు, నేతలు ఉత్సాహంగా సంబరాలు నిర్వహించారు. మిఠాయిలు పంచుకున్నారు. ఉప రాష్ట్రపతిగా ధన్కర్ గెలుపొందిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షులు నడ్డా, కేంద్ర సీనియర్ మంత్రులు ధన్కర్ను కలుసుకుని అభినందనలు తెలిపారు.
విపక్ష అభ్యర్థి మార్గరేట్ అల్వా విజేత అయిన ధన్కర్కు శుభాకాంక్షలుతెలిపారు. తనకు సంఘీభావం తెలిపిన ప్రతిపక్ష నేతలకు ధన్యవాదాలు చెప్పారు. ధన్కర్కు విపక్ష సభ్యుల నుంచి కూడా మద్దతు దక్కింది. నవీన్ పట్నాయక్‌కు చెందిన బిజెడి, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్, బిఎస్పి, టిడిపి , జెఎంఎం, అకాలీదళ్, ఏక్నాథ్ షిండే శివసేన వర్గం బాసటగా నిలిచింది. ఈ నెల 11వ తేదీన ధన్కర్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అంతకు ముందు రోజు వెంకయ్యనాయుడు వైదొలుగుతారు.
ఎన్‌డిఎలోని మొత్తం ఎంపిల బలం 441. వీరిలో బిజెపి ఎంపిల సంఖ్య 394. లోక్‌సభలో బిజెపికి సంపూర్ణ బలం ఉండటం, రాజ్యసభలో ఈ పార్టీకి 91 మంది సభ్యుల బలం ఉండటంతో ధన్కర్ గెలుపు సునాయసం అయింది. ఐదుగురు నామినేటెడ్ ఎంపీలు కూడా జగదీప్ ధన్కర్కు ఓటేశారు. మార్గరేట్ అల్వాకు ఆది నుంచి ఎదురుగాలి ఉండటం ఈ తుది ఫలితంతో స్పష్టం అయింది.
అల్వాకు కాంగ్రెస్, డిఎంకె, టిఆర్ఎస్ , ఆర్జేడీ, ఎన్‌సిపి, సమాజ్‌వాది పార్టీ , ఆప్, జార్ఖండ్ ముక్తిమోర్చా , వామపక్షాలు మద్దతు పలికాయి. శివసేన ఉద్ధవ్ వర్గం కూడా అల్వాకు మద్దతు ప్రకటించింది. ఎన్నికలలో జగదీప్ ధన్కర్ విజయం సాధించినట్లు ఆ తరువాత అధికారికంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి లోక్‌సభ సెక్రెటరీ జనరల్ ఉత్ఫల్కుమార్ సింగ్ ప్రకటించారు.
జగదీప్ ధన్కర్ గెలుపుతో ఆయన స్వస్థలమైన రాజస్థాన్‌లోని ఝున్‌ఝున్‌లో స్థానికులు సంబరాలు చేసుకుంటున్నారు. 1951లో జన్మించిన జగదీప్ ధన్కర్, లా పూర్తి చేసి న్యాయవాదిగా పనిచేశారు. ఆ తర్వాత 1989లో రాజకీయాల్లో చేరారు. 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఉప రాష్ట్రపతి పదవి దేశంలో రెండో అతిపెద్ద పదవి. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు పదవీ కాలం ఈ నెల 10న ముగుస్తుంది. 16వ ఉప రాష్ట్రపతిగా ఈ నెల 11న జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం చేస్తారు.