ఉత్తర ప్రదేశ్ లో అసాంఘిక శక్తులను ఉక్కుపాదంతో అణచివేస్తున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిందితుల అక్రమ కట్టడాల కూల్చివేతకు ఇప్పటివరకు మతం రంగు పూస్తున్నవారికి ఇప్పుడు స్వయంగా బిజెపి కార్యకర్త ఇంటిని కూల్చివేయడం జరిగింది. పైగా, స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం కలకలం రేపుతున్నది.
నొయిడా అధికారులు బీజేపీ యువనేత శ్రీకాంత్ త్యాగికి వ్యతిరేకంగా రంగంలోకి దిగారు. ఓ మహిళను దుర్బాషలాడి, దాడి చేసిన ఘటన, ఆపై అనుచరులతో బెదిరింపులకు దిగినందుకు ఆదివారం అతనిపై గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద నేరారోపణలు నమోదు చేశారు. సోమవారం నొయిడా సెక్టార్-93లోని గ్రాండ్ ఒమాక్సే హౌజింగ్ సొసైటీ వద్ద అతని ఇంటి ఆవరణలోని అక్రమ కట్టడాలను సంబంధిత అధికారులు కూల్చివేశారు.
ఈ కట్టడాలకు సంబంధించే స్థానిక ఇంటి ఓనర్లకు, శ్రీకాంత్ మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ మహిళతో శ్రీకాంత్ దారుణంగా వ్యవహరించాడు. ఆమెను దుర్భాషలాడడంతో పాటు దాడి యత్నానికి దిగాడు. ఆ వీడియో వైరల్ కావడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ లోపు శ్రీకాంత్ అనుచరులు మరోసారి హౌజింగ్ సొసైటీ దగ్గరకు చేరి ఆమె అడ్రస్ కావాలంటూ వీరంగం సృష్టించారు. దీంతో వాళ్లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం యోగి ఆదేశాల మేరకు సోమవారం ఉదయం ఉత్తర ప్రదేశ్ అధికారులు, నోయిడా పోలీసులు సంబంధిత స్థలానికి చేరుకుని త్యాగికి చెందిన అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని కట్టడాలను కూల్చేశారు.
ఆ సమయంలో స్థానికుల కరతాళ ధ్వనులతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. సొసైటీకి సంబంధించిన స్థలంలో త్యాగి నిర్మాణాలు చేపట్టడమే ఇందుకు కారణం. బుల్డోజర్ డ్రైవర్‌ను కీర్తిస్తూ వాళ్ల్లంతా నినాదాలు చేశారు. అంతటితో ఆగిపోకుండా,నోయిడాలోని భంగెల్ మార్కెట్లో ఉన్న అతని కార్యాలయాల్లో ఇన్కమ్ ట్యాక్స్ తనిఖీలు జరిగాయి. అక్కడ అతనికి 15 షాపులు ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని దుర్వినియోగం చేసినందుకు సైతం కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం పరారీలో ఉన్న అతని కోసం గాలింపు కొనసాగుతోంది.
ఉత్తరాఖండ్ వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు పోలీసులు. పదిహేను బృందాలు అతని కోసం గాలింపు చేపట్టాయి. చివరిసారిగా హరిద్వారా్-రిషికేష్ మధ్య అతని సిగ్నల్‌ను పోలీసులు ట్రేస్ చేయగలిగారు. అతని ఆచూకీ తెలిపిన వాళ్లకు రూ 25 వేల రివార్డును కూడా పోలీసులు ప్రకటించారు.