శతాబ్ధాలుగా అమెరికాలో ఆధిపత్యం వహిస్తున్న శక్తివంతమైన, సాంప్రదాయమైన క్రైస్తవ మతస్థుల ప్రాబల్యం నానాటికి తగ్గుముఖం పడుతున్నదా? భవిష్యత్ లో ఆ మతస్థుల కన్నా, ఆ మతం నుండి బైటకు వెళ్ళినవారు ఎక్కువగా ఉండే అవకాశం ఉందా? అంటే అవుననే తాజాగా జరిపిన ఒక అధ్యయనం స్పష్టం చేస్తున్నది.
అక్కడ ఇప్పటికీ క్రైస్తవమే ఆధిపత్యంలో ఉన్నా.. ఆ మతాన్ని వీడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చాలా అనూహ్య రీతిలో క్రైస్తవ మతం క్షీణిస్తున్నట్లు పివ్ రీసర్చ్ సెంటర్ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. నాస్తికులు, ఏ మతం స్వీకరించని వాళ్ల సంఖ్య అక్కడ క్రమంగా పెరుగుతోందని తెలిపింది.
ప్రస్తుతం అమెరికాలో 29 శాతం మంది యువత ఏ మతానికి చెందనివారు ఉన్నారు. గడిచిన 14 ఏళ్లలో ఇది 16 శాతం పెరిగినట్లు సర్వే పేర్కొన్నది. 2007లో సుమారు 78 శాతం మంది అమెరికా యువత తాము క్రైస్తవులమని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 63 శాతానికి పడిపోయినట్లు గుర్తించారు.
అమెరికాలో ఏయే మతస్థులు ఉన్నారో తెలుసుకునేందుకు 2007లో పివ్ రీసర్చ్ సంస్థ తొలిసారి అధ్యయనం చేపట్టింది. నాస్తికులమని చెప్పుకునేవాళ్లు, ఏ మతంతో సంబంధం లేదని చెప్పేవారి డేటా కూడా ఆ అందులో పొందుపరిచారు. అయితే గతంలో అయిదుగురిలో ఒకరు మాత్రమే వేరుగా ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది. ఇప్పుడు ఇద్దరిలో ఒకరు వేరన్న విషయాన్ని పరిశోధకులు గుర్తించారు.
కాగా, క్రైస్తవం ఎందుకు తగ్గుతుందో పరిశోధకులు తమ అధ్యయనంలో పేర్కొన్నలేదు. కానీ పశ్చిమ దేశాల్లో ఎక్కువ శాతం క్రైస్తవ మతం ప్రాబల్యాన్ని కోల్పోతున్నట్లు అంచనా వేస్తున్నారు. 2019 సర్వేలో ఎక్కువ శాతం యువత మాత్రమే తాము ఏ మతానికి చెందమని చెప్పినట్లు తెలిసింది.
మతాన్నీ వీడుతున్న వారిలో ఎక్కువగా ప్రొటెస్టాంట్ క్రైస్తవులు ఉన్నారని, క్యాథలిక్ క్రైస్తవుల్లో పెద్దగా మార్పేమీ లేదని అధ్యయనంలో తేల్చారు. నాలుగు వేల మందిని సర్వే చేసిన తర్వాత ఆ ఫలితాలను విడుదల చేశారు.