బీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఫగు చౌహాన్ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి లాలూ సతీమణి, మాజీ సీఎం రబ్రీ దేవి సహా పలువురు నేతలు హాజరయ్యారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు. నితీశ్ కుమార్ బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది ఎనిమిదోసారి.
రాజకీయ అస్థిరతలో బీహార్ లో నూతన అధ్యాయం మొదలైందని నితీష్ కుమార్ మరోమారు ముఖ్యమంత్రిగా పదవీప్రమాణం చేయడంపై స్పందిస్తూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పారు. బీజేపీ విషయంలో నితీష్ కుమార్ అసంతృప్తిగా ఉన్నారని, ఈ కారణంగానే ఎన్డీఏ నుంచి వైదొలగారని తెలిపారు.
అయితే, నితీష్ కుమార్, తేజశ్వి యాదవ్‌లను పునరేకీకరణ చేయడంలో తన పాత్రమీలేదని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. మహాఘట్బంధన్ ప్రభుత్వ ఏర్పాటులో తన భాగస్వామ్యంలేదని తేల్చిచెప్పారు. నితీష్ కుమార్ రాజకీయ ప్రయాణం, బీహార్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, చోటు చేసుకుంటున్న మార్పులపై ‘ఇండియా టుడే’తో ప్రశాంత్ కిశోర్ మాట్లాడారు.
బిహార్‌లో గత 10 ఏళ్లలో ఇది 6వ ప్రభుత్వమని గుర్తు చేస్తూ ఈ రాజకీయ మార్పులో రెండు అంశాలు యథావిథిగా ఉన్నాయని చెప్పారు. ఒకటి నితీష్ కుమార్ సీఎంగానే ఉండగా.. బిహార్ దుర్భరస్థితి అలాగే కొనసాగుతోందని పేర్కొన్నారు. నితీష్ కుమార్ వేర్వేరు ప్రయోగాలు ప్రయత్నించారని చెప్పారు. ప్రభుత్వం ఏవిధంగా ఏర్పాటైనా తన అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.
తేజశ్వి యాదవ్‌పై మాట్లాడుతూ.. ‘‘ లిక్కర్‌పై నిషేధించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. ఎలా వ్యవహరిస్తారు, ఏం చేస్తారనేది వేచిచూడాలి’’ అని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.
థర్డ్ ఫ్రంట్ ఏర్పాటైతే నరేంద్ర మోదీకి పోటీగా నితీష్ కుమార్ ప్రధాని అభ్యర్థిగా ఉంటారనే చర్చపై ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ నితీష్ కుమార్ మనసులో ఏముందో తెలియదని పేర్కొన్నారు. మోదీకి ఎవరు సవాలు విసరబోతున్నారమో తాను చెప్పలేనని తెలిపారు.
ఇదిలావుండగా, ఆర్జేడీ నేత శరద్ యాదవ్ మాట్లాడుతూ, 2024 లోక్‌సభ ఎన్నికలకు నితీశ్ కుమార్ ఆదర్శప్రాయమైన ప్రధాన మంత్రి అభ్యర్థి అని చెప్పారు. ఆయన మహాకూటమి తరపున ప్రధాన మంత్రి అభ్యర్థి కాగలరన్నారు.
అయితే, నితీశ్ కుమార్ నేతృత్వంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం తన పదవీ కాలం ముగియక ముందే (2025కు ముందే) పతనమవుతుందని బిజెపి నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ జోస్యం చెప్పా రు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్య పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకుని ఆ పార్టీని చీల్చుతారని ఆరోపించారు.