శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైల్ సదుపాయం కల్పించడం కోసం రాయదుర్గం– శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో కారిడార్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించి మూడేళ్లు కావస్తున్నా ఇప్పట్లో పనులు జరిగే అవకాశం కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధులు కల్పించక పోవడమే ప్రధాన ఆటంకంగా ఉన్నది.
2019లోనే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రూ 4,500 కోట్ల వ్యయంతో అందుకు అవసరమైన పనులు చేపట్టడానికి మెట్రో రైల్ యాజమాన్యం కూడా సిద్ధంగా ఉంది. 30–32 కి.మీ పొడవైన ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ మెట్రో కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి.
కానీ ప్రభుత్వం అవసరమైన నిధులను కేటాయించక పోవడంతో ఇప్పటికి కనీసం భూసేకరణ కూడా చేయలేక పోయింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఎయిర్ పోర్ట్ కు ప్రయాణ కాలం 40 నిముషాల నుండి 20 నిముషాలకు తగ్గుతుందని భావిస్తున్నారు.
ఢిల్లీ మెట్రో అధికారులు ఏడాది క్రితం రాయదుర్గం– శంషాబాద్ రూట్ లో పర్యటించి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ను రూపొందించి హైదరాబాద్ మెట్రో అధికారులకు అందించారు. ఈ మార్గంలో హెచ్ఎండీఏ భూములు కూడా ఉండటంతో భూ సేకరణలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం హెచ్ఎండీఏ, మెట్రో, టీఎస్ఐఐసీని భాగస్వామ్యం చేస్తూ స్పెషల్ పర్పస్ వెహికల్ కోసం ప్రత్యేక విభాగంను కూడా ఏర్పాటు చేసింది.
ఇందులో భాగంగా హెచ్ఎండీఏ నుంచి రూ. 350 కోట్లు నిధులు ఇవ్వాలంటూ గతంలో మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కానీ భారీ అంచనాలతో రూపొందించిన ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నిధులు సమకూరితే గానీ పనులు మొదలు కావని మెట్రో రైల్ వర్గాలు
స్పష్టం చేస్తున్నాయి.
ఇప్పటికే ఫండింగ్ ఏజెన్సీలతో స్పెషల్ వింగ్ ఆధ్వర్యంలో చర్చలు జరిగినా ఫలితం లేకపోయిన్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధుల పైననే ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రూ.వెయ్యి కోట్ల నిధులు కూడా మంజూరు కాలేదని చెబుతున్నారు.
ఐటీ కారిడార్ నుంచి ఎయిర్ పోర్టు మార్గంలో రియల్ ఎస్టేట్‌కు భారీగా డిమాండ్ ఉంది. ఇప్పటికే లగ్జరీ విల్లాలు, వేల మంది ఉండే అపార్టుమెంట్లకు దీటుగా హైరైజ్ బిల్డింగ్లు ఆయా ప్రాంతాల్లో భారీగా వస్తున్నాయి. ఈ క్రమంలో రాయదుర్గంతో ఆగిపోయిన మెట్రో లైన్‌ను విస్తరణ పూర్తయితే రవాణా సదుపాయాలలు మరింత మెరుగుపడతాయి.
ఈ మెట్రో ప్రాజెక్టు మార్గంలో ఓఆర్ఆర్ కు సమీపంలోని గచ్చిబౌలి, అప్పా జంక్షన్, కిస్మత్‌పురా మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు రద్దీ పెరగనుంది. ఇప్పటికే రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టు వరకు ఓఆర్ఆర్ మీదుగా వెళ్లే వాహనాల సంఖ్య 30–45 వేలు ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. కరోనా తర్వాత ప్రైవేటు వాహనాలలోనే లోనే ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారు. ఎయిర్ పోర్టు వరకు మెట్రో నిర్మాణం పూర్తయితే గ్రేటర్ హైదరాబాద్ పౌరులకు అక్కడికి వేగంగా చేరుకునే అవకాశం కలుగుతుంది.