బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్ మరొసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్ర శాసనసభలో బలపరీక్షకు వెనుకడుగు వేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రెండు వారల తర్వాత, ఈ నెల 24 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కొత్తగా ఏర్పాటైన జెడియు, ఆర్జెడి ప్రభుత్వం తన మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉంది.
బీజేపి ఎమ్ఎల్ఎ అయిన విజయ్ కుమార్ సిన్హా స్పీకర్ పదవికి రాజీనామా ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన ఉండగా బలపరీక్షకు నితీష్ జంకుతున్నట్లు తెలుస్తున్నది. అందుకనే ముందుగా, నితీశ్ కుమార్ ప్రభుత్వం ఆయనపై అవిశ్వాస తీర్మానం ఇచ్చింది.
అసెంబ్లీ సమావేశాల తొలి రోజున దీనిపై చర్చించి ఓటింగ్ నిర్వహిస్తారు. కొత్త ప్రభుత్వం తమ బలపరీక్ష కంటే ముందుగా ప్రస్తుత స్పీకర్‌ను మార్పు చేయాలని కోరుకుంటోంది. ఇప్పటికే 55 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ విజరు కుమార్ సిన్హాకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కోసం విజ్ఞప్తి చేశారు.
నిబంధనల ప్రకారం ఇలాంటి విజ్ఞప్తి చేసిన రెండు వారాల తరువాతే సభ చర్య తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయితే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుత ప్రభుత్వానికి 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది.
ఈ నెల 24 అసెంబ్లీ సమావేశం తొలి రోజు స్పీకర్ సిన్హాపై అవిశ్వాస తీర్మానం పెట్టి అతన్ని తొలగించిన తరువాత ఈ నెల 25న బలపరీక్ష జరగాలని నితీష్ ప్రభుత్వం కోరుకుంటుంది.
నితీష్ కుమార్‌ను ఉపరాష్ట్రపతి చేయాలని కొంత మంది జెడియు నేతలు బిజెపిని సంప్రదించారని, అందుకు ఒప్పుకొనక పోవడంతోనే ఎన్డీయే నుండి వైదొలిగారని బీహార్ బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు సుశీల్ మోడీ చేసిన ఆరోపణ రాజకీయంగా కలకలం రేపింది. అయితే, ఈ ఆరోపణలను నితీష్‌కుమార్ తీవ్రంగా ఖండించారు.