హెలికాఫ్టర్ ప్రమాదంలో గత వారం దుర్మరణం చేసింది జనరల్ బిపిన్ రావత్ భారత సైన్యంలో పనిచేసిన 42 ఏళ్లలో కూడా అత్యధిక కాలం పోరాటాలు జరుగుతున్న ప్రాంతాలలోనే పనిచేశారు. ముఖ్యంగా భారత్, చైనా సరిహద్దులలో వివిధ హోదాలలో, దాదాపు అన్ని ప్రాంతాలలో పనిచేశారు. అటువంటి అనుభవం ఉన్న సైనికాధికారులు చాలా అరుదని చెబుతుంటారు.
ఉగ్రవాద, వేర్పాటువాద నిరోధక ఆపరేషన్లను సమర్థంగా నిర్వహించడంలో ఆయనకు ఎంతో అనుభవం ఉంది. తన కెరీర్లో సరిహద్దుల వద్ద జరిగిన ఘర్షణలు ఎన్నింటినో ఆయన చాకచక్యంగా పరిష్కరించారు. ఆ అనుభవం కారణంగానే ఆయన్ను కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాల అధిపతిగా నియమించింది.
ముఖ్యంగా ఉగ్రవాదులపై ఉక్కు పిడికిలి బిగించడంతో ఆయన వారి పట్ల సింహస్వప్నంగా మారారు. మొదటిసారిగా ఉగ్రవాదుల వేటలో ఆయన సారథ్యంలోనే విదేశీ భూభాగాలపైకి వెళ్లి పోరాటం చేసింది. 2016 లో భారత్‌లోని యూరీ బేస్ క్యాంప్‌పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 19 మంది జవాన్లు అమరులయ్యారు.
దీనికి ప్రతీకారంగా ఎల్ఓసీ వెంబడి భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఈ సమయంలో రావత్ ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ గా బాధ్యతల్లో ఉన్నారు. 2019 లో పాకిస్తాన్ బాలాకోట్ తీవ్రవాద ట్రైనింగ్ క్యాంపులపై భారత వాయుసేన విరుచుకుపడుతూ దాడులు చేసింది.ఈ సమయంలో రావత్ భారత ఆర్మీ చీఫ్‌గా బాధ్యతల్లో ఉన్నారు.
ఈ రెండు సంఘటనలు ఒక విధంగా పాకిస్థాన్ లో వణుకు పుట్టిస్తున్నాయి. గత ప్రభుత్వాల కాలంలో వలే ఉగ్రవాద కార్యకలాపాలను భారత్ భూభాగంకు పరిమితం చేయలేమని గ్రహించింది. ఉగ్రవాదుల వేటలో భాగంగా తమ భూభాగంలో ప్రవేశించడంకు భారత్ సైన్యం వెనుకడుగు వేసే ప్రశ్నలేదని స్పష్టమైన సంకేతం ఇచ్చిన్నట్లయింది.
ఇక రావత్ కెరీర్లో మరో విశేషం జరిగింది. 2015 లో మణిపూర్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేసి, మయన్మార్ పారిపోయారు. దీంతో భారత సైన్యం మయన్మార్ సరిహద్దుల్లోకి చొరబడి మరీ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్‌లో 21 మంది పారా మిలటరీ సైనికులు పాల్గొన్నారు. ఈ బృందానికి రావత్ నేతృత్వం వహించారు.
విశేషించి చైనా, పాక్ సరిహద్దుల విషయంలో ఆయనకు అపారమైన పట్టుందని ఆర్మీ అధికారులు పేర్కొంటారు. ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఆయన వివిధ హోదాల్లో తన విధులు నిర్వర్తించారు. చైనా, పాక్ దేశాలు ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తాయి? ఆ దేశాలను సరిహద్దుల్లో ఎదుర్కోవడం ఎలా? అన్న విషయంలో రావత్ పరిపూర్ణమైన అవగాహనతో ఉంటారన్న ప్రచారమూ ఉంది. అందుకనే వారి ఎత్తుగడలను ముందుగానే గ్రహించి, మన సైన్యాన్ని సిద్ధం చేస్తుండేవారు.
బిపిన్ రావత్ తన కెరీర్లో ఎంత దూకుడుగా వ్యవహరించారు. సరిహద్దుల్లో ఉగ్రవాదులు, శత్రుదేశాలకు జరిపిన ఆపరేషన్లను సమర్థంగా నిర్వర్తించారు. 1962లో చైనాతో యుద్దం తర్వాత తొలిసారిగా మెక్‌మొహన్ రేఖ వద్ద 1987లో ఘర్షణలు చెలరేగాయి. ఆ సమయంలో బిపిన్ రావత్ తన టీమ్‌తో కలిసి చైనా సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొంది.
రావత్ శత్రుదేశాలపై నిర్మొహమాటంగా మాటలు సంధించేవారు. ఈటెల్లాంటి మాటలతో విరుచుకుపడేవారు. ‘చైనా, పాకిస్తాన్ల దురాక్రమణ కాంక్ష భారత సైన్యం అనుక్షణం అప్రమత్తంగా ఉండేటట్లు చేస్తోంది. సరిహద్దులతో పాటు… తీర ప్రాంతాల్లో ఏడాది పొడవునా గట్టి నిఘా అవసరం. ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నపుడు… ఎటువైపు నుంచి యుద్ధం మొదలవుతుందో … అది ఎక్కడి దారితీస్తుందో తెలియదు. కాబట్టి ఇరువైపులా సర్వసన్నద్ధంగా ఉండాల్సిందే’ అంటూ మన సైనికులను అప్రమత్తం చేస్తుండేవారు.
‘పాక్‌తో చైనా స్నేహం, జమ్మూకశ్మీర్‌పై డ్రాగన్ వైఖరిని బట్టి చూస్తే వారిది భారత్ వ్యతిరేక అనుబంధంగా అభివర్ణించొచ్చు’ అంటూ ఎద్దేవా చేశారు. ‘చైనా ధనబలాన్ని, వాణిజ్యాన్ని అడ్డుపెట్టుకొని ఇరుగుపోరుగు దేశాల్లో ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది’ అంటూ డ్రాగన్ ధోరణిని ఎండగట్టారు.
‘పాక్‌ను నియంత్రించాల్సిన అవసరం లేదు. అదే క్రమేపీ తమ దేశంపై పట్టు కోల్పోతోంది. దానికోసం మనం ప్రత్యేకంగా కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం లేదు. వారే కొంపను అంటించుకునే క్రమంలో ఉన్నారు’ అంటూ దాయాది దేశాన్ని ఎద్దేవా చేశారు.
సైన్యంలో భారీ సంస్కరణలు
ఆర్మీ చీఫ్ గా, ఆ తర్వాత సిసిఎస్ గా భారత సైన్యంలో, ఆయుధ సేకరణలో అతిపెద్ద సంస్కరణలను ఆయన చేపట్టారు. రాబోయే నూతన తరహా యుద్ధాలకు భారత సైన్యమును సంసిద్ధం చేయడం కోసం అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చుకోవడంలో చాల క్రియాశీలంగా పనిచేశారు. ముఖ్యంగా అత్యాధునిక ఆయుధాల సేకరణ, స్వదేశంలో ఆయుధాల తయారీని ప్రోత్సహించడం వంటి వాటిల్లో కీలక భూమిక వహించారు.
ప్రత్యక్షంగా యుద్ధరంగంలో విశేషంగా ఆయనకు గల అనుభవం, కార్యదక్షతలను దృష్టిలో ఉంచుకొనే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇద్దరు సీనియర్లను కాదని ఆయనను ఆర్మీ చీఫ్ గా నియమించింది. ఆ సమయంలో కొందరు ఆయన నియామకాన్ని విమర్శించినా, ఆయన చేసిన సేవలను చూసిన వారందరికీ ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకున్నట్లు స్పష్టమయింది.
తన కార్యదక్షత, నిరుపమానమైన ప్రతిభ, అశేషమైన దేశ భక్తితో అందరికీ తలలో నాలుకలా మెలిగారు. త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం సాధించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీడీఎస్ హోదాలో ఆయనే నియమించింది.
ఈ హోదాలో త్రివిధ దళాలను కలిపి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ లను ఏర్పాటు చేసే బాధ్యతలను భారత ప్రభుత్వం ఆయనపై ఉంచింది. గత రెండేళ్లుగా అందుకోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. కేవలం 1971 బాంగ్లాదేశ్ యుద్ధం సమయంలో మాత్రమే మన త్రివిధదళాలు ఆ విధంగా కలసి పనిచేసాయి.
ఉత్తరాఖండ్‌లోని పౌరీలో 1958లో బిపిన్ రావత్ జన్మించారు. వారిది రాజ్‌పుత్ కుటుంబం. బిపిన్ రావత్ తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ భారత ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్‌గా రిటైర్ అయ్యారు. చిన్నతనం నుంచి తండ్రిని చూస్తూ సైన్యంపై బిపిన్ రావత్ మక్కువ పెంచుకొని 1978లో భారత సైన్యంలో ప్రవేశించారు.