ఆర్టిమిస్ కార్యక్రమం కింద చంద్రుని పైకి 2024 నాటికి వ్యోమగాములు చేరుకోడానికి వీలుగా చంద్రుని దక్షిణ ధ్రువంపై 13 ప్రాంతాలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించింది. దక్షిణ ధ్రువం అంతా కఠినమైన నేలతో, బిలాలతో నిండి ఉంటుంది. ఈ 13 ప్రాంతాలు ఒక్కొక్క దానిలో వ్యోమగాములు దిగడానికి అనువైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వ్యోమగాముల్లో ఒక మహిళ కూడా ఉండడం విశేషం. ఇంతవరకు చంద్రుని ఉపరితలంపై మహిళలు ఎవరూ కాలు మోపలేదు.
అపోలో రాకెట్ ప్రయోగం తరువాత మానవ జాతి చంద్రుని పైకి వేసే ముందడుగుగా నాసా అభివర్ణించింది. ఇంతవరకు ఎవరూ పరిశోధించని ప్రాంతాలను ఇప్పుడు పరిశోధించనున్నారు. ఈ ప్రాంతాలు ఒక్కొక్కటి చంద్రుని దక్షిణ ద్రువానికి ఆరు డిగ్రీల అక్షాంశం పరిధిలో ఉన్నాయి.
దక్షిణ ద్రువానికి అతిసామీప్యంలో ఉండడంతో శాస్త్రీయంగా చెప్పుకోతగినవి. ఈ ప్రాంతాలన్నీ శాశ్వతంగా నీడ కలిగి ఉంటాయి. మానవులు ఎవరూ ఇంతవరకు కనిపెట్టని ఈ ప్రాంతాల్లో ఖనిజాలు అపారం.
గతంలో అధ్యయనం చేయని చంద్రుని మట్టి, ఇతర నిక్షేపాలను ఇప్పుడు అధ్యయనం చేయడం ద్వారా చంద్రుని చరిత్ర తెలుసుకోడానికి వీలవుతుందని నాసాకు చెందిన ఆర్టిమిస్ లూనార్ సైన్స్ కోఆర్డినేటర్ సారా నోబెల్ వెల్లడించారు. ఈ 13 రీజియన్ల (ప్రాంతాలు)లో ఆరున్నర రోజుల పాటు నిరంతరాయంగా సూర్యకాంతి ఉంటుంది.
ఈ విధంగా సూర్యకాంతి అందుబాటు కావడం చంద్రునిపై సుదీర్ఘకాలం పరిశోధనలు చేయడానికి ఉపయోగమౌతుంది. సూర్యకాంతివల్ల ఆర్టిమిస్ ప్రయోగానికి కావలసిన విద్యుత్ సరఫరా, ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు కనీస ప్రమాణ స్థాయిలో సరిచేయడానికి వీలవుతుంది. నాసా సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న ఆర్టిమిస్ ప్రయోగం ఆగస్టు ఆఖరి వారంలో ప్రారంభమౌతుంది. ఈ ప్రయోగం కోసం నాసా ఆగస్టు 29, సెప్టెంబరు 2, సెప్టెంబరు 5 తేదీలను ఎంచుకుంది.