కామన్వెల్త్ లో మహిళల ప్రదర్శన అమోఘమని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. బాక్సింగ్, జూడో, రెజ్లింగ్ వంటి క్రీడల్లో భారత మహిళలు ఆధిపత్యం చెలాయించారని ప్రశంసించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో అదరగొట్టిన భారత అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోడీ తన నివాసంలో ప్రత్యేకంగా ఆతిథ్యమిచ్చారు.
అథ్లెట్ల కఠోర శ్రమ, స్ఫూర్తిదాయకమైన విజయాలతో దేశం ‘ఆజాదీ కా అమృత్ కాలంలోకి అడుగుపెట్టడం గర్వించదగ్గ విషయమని ప్రధాని తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి నాలుగు కొత్త గేమ్‌లలో మెడల్స్ సాధించారని.. లాన్ బౌల్స్ నుండి అథ్లెటిక్స్ వరకు, అద్భుతమైన ప్రదర్శన చేశారని ప్రధాని చెప్పారు.
ఈ ప్రదర్శనతో దేశంలో కొత్త క్రీడల పట్ల యువతలో ఆసక్తి చాలా పెరగనుందని పేర్కొన్నారు. కామన్వెల్త్ ద్వారా త్రివర్ణ పతాకం శక్తి మరోసారి ప్రపంచానికి తెలిసిందని ప్రధాని అభినందించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు సాధించిన విజయాలను ప్రధాని ప్రశంసిస్తూ అథ్లెట్లు దేశానికి పతకాలు సాధించడమే కాకుండా ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని బలోపేతం చేశారని కొనియాడారు. ప్రతి రంగంలో యువతకు స్ఫూర్తినిచ్చారని ప్రధాని చెప్పారు.
ప్రతిష్టాత్మక క్రీడా వేదికపై త్రివర్ణ పతాకం రెపరెపలాడినపుడు గర్వంతో గుండె ఉప్పొంగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా యూకేకు బయల్దేరే ముందు కూడా క్రీడాకారులతో ప్రధాని మోదీ భేటీ అయిన విషయం తెలిసిందే. దేశాన్ని గర్వపడేలా చేస్తామని అప్పుడు తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 61 మెడల్స్ సాధించి పతకాల పట్టికలో నాల్గో స్థానంలో నిలిచింది. ఇందులో 22 గోల్డ్ మెడల్స్, 16 సిల్వర్ మెడల్స్, 23 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. వెయిట్ లిఫ్టింగ్‌లో 10 పతకాలు సాధించగా, రెజ్లింగ్ ఆరు స్వర్ణాలతో సహా 12 పతకాలతో పతక పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.