‘‘2047 నాటికి భారత్ కు స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తవుతుంది. అప్పటిలోగా మన స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేసుకునే లక్ష్యంతో ముందుకు కదలాలి’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగీస్తూ దేశభక్తితో భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన సమర యోధులను స్మరించుకునే సందర్భాన్ని కల్పించిన ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ను గొప్ప కార్యక్రమంగా అభివర్ణించారు.
వచ్చే 25 ఏళ్లు అమృతకాలమని తెలుపుతూ ఈ వ్యవధిలో దేశం అభివృద్ధి మరింత వేగవంతం కావాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను మరువలేమని, వారు చూపిన బాటలో నడవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె ఉద్బోధించారు.
‘‘కరోనాను భారత్ సమర్ధంగా తిప్పికొట్టింది. దేశంలోనే వ్యాక్సిన్ల అభివృద్ధి సైతం జరిగింది. కరోనాపై యుద్ధంలో భారత్ సాధించిన విజయంలో ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, శాస్త్రవేత్తల పాత్ర అత్యంత కీలకమైంది. ఇతర దేశాలకూ కరోనా వ్యాక్సిన్లను అందించే స్థాయికి భారత్ ఎదగడం ప్రశంసనీయం’’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
‘‘డిజిటల్ ఇండియా సాకారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. స్టార్టప్ లకు నెలవుగా భారత్ మారింది. స్టార్టప్ ల ప్రోత్సాహానికి అనుకూల వాతావరణం దేశంలో ఉంది’’ అని రాష్ట్రపతి ముర్ము చెప్పారు. ‘‘నవంబర్ 15వ తేదీని ‘జన జాతీయ గౌరవ్ దివస్’గా పాటించాలన్న ప్రభుత్వ నిర్ణయం మంచిది. మన గిరిజన వీరులు కేవలం స్థానిక ప్రాంతీయ చిహ్నాలు మాత్రమే కాకుండా యావత్ జాతికి స్ఫూర్తి’’ అని ఆమె తెలిపారు.
ప్రజాస్వామ్యపు నిజమైన సామర్ధ్యాన్ని ప్రపంచం గ్రహించే విధంగా భారత్ తోడ్పడుతున్నదని చెబుతూ ఇతర దేశాల్లో మహిళలు ఓటు హక్కు కోసం ఎంతో పోరాడాల్సి వచ్చిందని.. భారత్ లో మాత్రం స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచే మహిళలకు ఓటుహక్కు లభించిందని రాష్ట్రపతి గుర్తు చేశారు.
దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఇది దేశ ప్రజలంతా సంబురాలు చేసుకోవాల్సిన సమయం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమరుల త్యాగాలను మనమంతా గుర్తు చేసుకోవాలి. జవాన్ల ప్రాణత్యాగాల వల్లే దేశానికి వాయువులు. మనది శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశమే కాదు.. విజయవంతమైన ప్రజాస్వామ్య దేశం కూడా” అని ద్రౌపది ముర్ము గుర్తు చేశారు.
“భారత్ అనేక రంగాల్లో ముందుకెళ్తోంది. కరోనా కష్టకాలాన్ని అధిగమించాం. కరోనా తర్వాత మన ఆర్థిక వ్యవస్థ క్రమేపీ పుంజుకుంటోంది. వ్యాక్సినేషన్లో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాం’ అని ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో పేర్కొన్నారు.