ప్రముఖ క్రికెటర్ సౌరవ్ గంగూలీ 2024 ఎన్నికల లోగా పశ్చిమ బెంగాల్ లో బిజెపికి సారధ్యం వహించనున్నారా? స్వతంత్ర దినోత్సవంకు రెండు రోజుల ముందు ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాలను కలవడంతో ఈ విషయమై మరోసారి ఊహాగానాలు చెలరేగుతున్నాయి. బెంగాల్ లో మమతా బెనర్జీని ఎదుర్కోవడానికి బిజెపి ఎంతో కష్టపడి పనిచేస్తున్నా, ప్రజాదరణతో ఆమెతో పోటీ పడగల నాయకత్వం లేక పోవడంతో వెనుకంజ వేస్తున్నది.
గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గంగూలీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని బిజెపి ఉత్సాహ పడింది. అయితే ఆ సమయంలో ఆయన అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడంతో కార్యరూపం దాల్చలేదు. ఆయన తరచూ బిజెపి కేంద్ర నాయకులను కలుస్తూ ఉండడంతో అయన బీజేపీలో చేరబోతున్నట్లు ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన అటువంటి వార్తలను తోసిపుచ్చుతూ వస్తున్నారు.
ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఉన్నారు. దానికి అమిత్ షా కుమారుడు జై షా కార్యదర్శి కావడంతో ఆయనకు అమిత్ షా కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. కొద్ది కాలం క్రితం కలకత్తాకు వెళ్లిన అమిత్ షా గంగూలీ ఇంతో విందు చేశారు కూడా.
ప్రధాని మోదీ ఇంట్లో శుక్రవారం జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న భారత అథ్లెట్ల సత్కార కార్యక్రమంలో గంగూలీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. అనురాత్ ఠాకూర్ కు క్రికెట్ బోర్డు వ్యవహారాలలో మంచి పలుకుబడి ఉంది. ఈ సందర్భంగా గంగూలీ మోదీ, ఇద్దరు కేంద్ర మంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలుస్తున్నది.
గంగూలీ ఐసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ, కార్యదర్శిగా జై షా పదవీకాలం ముగియడంతో తదుపరి కార్యాచరణ కోసమే ఈ సమావేశం జరిగిందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. గంగూలీ ఐసీసీ అధ్యక్షుడిగా, జై షా బీసీసీఐ అధ్యక్షుడిగా అయ్యే అవకాశాలున్నాయని కూడా ప్రచారం జరుగుతోంది.
అయితే అందుకోసం ప్రధానిని కావలసిన అవసరం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా 2024 ఎన్నికల నాటికి బిజెపి ప్రచార సారధిగా బెంగాల్ లో గంగూలీ సేవలను వినియోగించుకునేందుకు ఆ పార్టీ అగ్ర నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది. తద్వారా 2024లో ఆ రాష్ట్రంలో అత్యధిక లోక్ సభ స్థానాలు గెలుపొందాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.