మునుగోడు కాంగ్రెస్ ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు, శాసనసభ్యత్వానికి సహితం రాజీనామా చేయడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఉప ఎన్నిక అంటూ జరిగితే తెలంగాణ రాజకీయ గమనాన్ని మార్చే విధంగా ఫలితాలు ఉండే అవకాశం ఉంది.
వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలను కృతనిశ్చయంతో ఉన్న బిజెపి ఇప్పటికే ఆ దిశలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ఉండగా, ఈ ఉప ఎన్నిక అవకాశం రావడంతో మరింత ఉత్సాహంగా ఉరకలు వేస్తున్నది. పైగా ఈ ప్రాంతంలో బలమైన నేపధ్యం గల రాజగోపాలరెడ్డి బీజేపీలో చేరడంతో, బిజెపిని ఎదుర్కోవడం టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు జీవన్మరణ పోరాటంగా మారనున్నది.
మనుగోడు ఉప ఎన్నిక ఫలితం మీదే తెలంగాణలో తమ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉందని, అది గెలవకపోతే తమ రాజకీయ మనుగడ ప్రశ్నార్ధకం కాగలదని ఆందోళనలు రెండు పార్టీలను వెంటాడుతున్నాయి.
దానితో ఈ ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించి, తెలంగాణాలో రాబోయే ప్రభుత్వం తమదే అన్న సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయడం కోసం బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అయితే అధికార పక్షం టిఆర్ఎస్ లో గాని, ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ లో గాని అటువంటి ఉత్సాహం కనిపించడం లేదు. ఆ రెండు పార్టీలు ఓ విధంగా ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది.
వరుస పరాజయాల తర్వాత జరుగుతున్న ఈ ఉపఎన్నికలో విజయం సాధింపలేని పక్షంగా ఇక తమ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించినట్లు రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చిన్నట్లు కాగలదని టిఆర్ఎస్ నేతలలో వణుకు ప్రారంభమయింది. అదే జరిగితే, పార్టీ నుండి భారీ ఎత్తున ఇతర పార్టీలలోకి వలసలు తప్పవని భయపడుతున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక కాగానే పార్టీకి, తమ పదవులకు రాజీనామా చేయడానికి కనీసం 12 మంది టిఆర్ఎస్ ఎమ్యెల్యేలు సిద్ధంగా ఉన్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రకటన ఆ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. తమ పార్టీకి కంచుకోట వంటి దుబ్బాక, హుజురాబాద్ లలో జరిగిన ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థులు గెలుపొందారు.
తమ పార్టీకి చెప్పుకోదగిన బలం లేని ఈ నియోజకవర్గంలో యెట్లా గెలుస్తామనే సందేశం వారిని వెంటాడుతున్నది. ఉపఎన్నికల్లో పోటీచేసి, మరో పరాజయంను మూటగట్టుకొని, వచ్చే ఏడు జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలకన్నా ముందే చేతులు ఎత్తేయడంకన్నా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా పరువు దక్కించుకోవాలనే ఆలోచనలు అధికార పక్షంలో సాగుతున్నట్లు తెలుస్తున్నది.
ఇక, మునుగోడు కాంగ్రెస్ కంచుకోట అని చెప్పుకొంటున్న ఆ పార్టీ నేతలలో ఎవ్వరి దారి వారిదిగా ఉన్నది. పరస్పరం నిందలు వేసుకోవడంతోనే సరిపెట్టుకుంటున్నారు. మొత్తం తెలంగాణాలో కాంగ్రెస్ కొంచెం బలంగా ఉన్నాదని భావిస్తున్న పాత నల్గొండ జిల్లాలో, పార్టీకి మొదటి నుండి మద్దతుగా ఉంటూ వస్తున్న మణుగోడలో ఓటమి చెందితే ఇక కాంగ్రెస్ పని తెలంగాణాలో అయిపోయినదనే సంకేతం ప్రజలకు వెళ్లే అవకాశం ఉంది.
అదే జరిగితే, అసెంబ్లీ ఎన్నికల ముందే పార్టీ నేతలు చేతులు ఎత్తి వేయక తప్పదు. ఎన్నికల నాటికి ఎవ్వరు పార్టీలో మిగులుతారో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నియోజకవర్గంలో అటు టిఆర్ఎస్ లో, ఇటు కాంగ్రెస్ లో కూడా అంతర్గత కుమ్ములాటలు తీవ్రంగా వెల్లడి అవుతున్నాయి. రెండు పార్టీల ఎన్నికలలో పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడమే కష్టంగా భావిస్తున్నాయి.
మునుగోడు నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజిక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకే ఈ ఉప ఎన్నికను ఓ సవాల్ గా తీసుకుంది. మునుగోడులో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన నేతలు విస్తృతంగా ప్రజలలోకి వెడుతున్నారు. అనేకమందిని బిజెపిలోకి చేర్చుకుంటున్నారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ఈ జిల్లాలో కొనసాగడంతో సానుకూల వాతావణం కలిగించడానికి దోహదపడుతుంది.
మరోవంక, ఇతర పార్టీల నాయకులకు చేర్చుకునేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వంక ప్రజలలోకి చొచ్చుకుపోయి ప్రయత్నాలు చేస్తూనే, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. బీజేపీ నేతలంతా మునుగోడులోనే మకాం వేసి ఇంటింటికీ వెళ్లి టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడం ప్రారంభించారు.
అంతేకాకుండా, తాము అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. మొత్తమ్మీద హుజూరాబాద్ తరహాలోనే మునుగోడు ఉపఎన్నికల్లోనూ విజయం సాధిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టే అవకాశానికి మరింత చేరువవుతామని బీజేపీ భావిస్తోంది.
టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ బీజేపీ ఏమి చేస్తుందో, కాపీ కొట్టిన్నట్లుగా చేయడం తప్పా సొంతంగా ప్రజలలోకి వెళ్లే చొరవ చూపలేక పోతున్నాయి. అమిత్ షాతో బిజెపి బహిరంగ సభ పెడుతున్నదని, అధికార పక్షం రెండు రోజుల ముందే కేసీఆర్ తో బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించింది. అదే విధంగా సంజయ్ పాదయాత్ర జరుపుతున్నారని, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహితం నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు.