అమెరికాలోని టెక్ కంపెనీలలో సహితం కులం పేరిట వివక్షతను ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది. నైపుణ్యం ఉన్నప్పటికీ దళితులైన అభ్యర్థులను ఉన్నతస్థాయి అధికారులుగా నియమించేందుకు టెక్ సంస్థలు వెనకాడుతున్నాయి. ఈ వివక్షపై అమెరికా న్యాయస్థానంలో దావా కూడా దాఖలైంది.
ఈ కేసు ద్వారా అక్కడ భారతీయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివక్షలు వెలుగుచూశాయని రాయిటర్స్ సర్వేలో తేలింది. కులం అనే వర్గాన్ని కొన్ని కంపెనీలు పెద్దగా పట్టించుకోవడం లేదని తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన టెక్ కంపెనీలు అమెజాన్, డెల్, మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్ సహా అనేక కంపెనీలు తమ కంపెనీ నిబంధనల్లో కుల వివక్ష కేటగిరిని చేర్చడం లేదని పేర్కొంది.
ప్రపంచంలోనే అతిపెద్ద లిస్టెడ్ కంపెనీ అయిన ఆపిల్ జాతి, మతం, లింగం, వయస్సు, మూలాలతో పాటు కులం ఆధారంగా ఉద్యోగుల మధ్య వివక్షతను నిషేధించడానికి సుమారు రెండేళ్ల క్రితమే ఈ పాలసీని తీసుకువచ్చినట్లు తెలిపింది. ఐబిఎం టెక్ సంస్థ కూడా కులం కేటగిరీని తమ కంపెనీ నిబంధనల్లో చేర్చినట్లు తెలిపింది.
ఈ రెండు సంస్థలు మినహా మిగతా పెద్ద టెక్ సంస్థలు కుల వివక్షను పట్టించుకోవడం లేదు. ఈ రెండు సంస్థలు కూడా తమ నిబంధనల్లో అయితే చేర్చాయి కానీ వాస్తవంగా కుల వివక్ష లేకుండా చేయలేకపోతున్నాయని ఉద్యోగులు పేర్కొన్నట్లు రాయిటర్స్ తెలిపింది.
”టెక్ కంపెనీల నిబంధనల్లో అస్థిరత ఉండటంతో నేను పెద్దగా ఆశ్చర్యపోలేదు” అని కుల సమస్యలపై అధ్యయనం చేసే సౌత్ కరోలీనా విశ్వవిద్యాలయ న్యాయ ప్రొఫెసర్ కెవిన్ బ్రౌన్ ఈ నివేదికపై స్పందించారు. చట్ట పరిధిలో లేనపుడు ఈ పరిస్థితే ఎదురవుతుందని పేర్కొన్నారు. దీంతో అమెరికా వివక్ష చట్టాల (యుఎస్ డిస్క్రిమినేషన్ లాస్) కింద కులం కేటగిరీని చేర్చాలని పలు ఉద్యోగ సంఘాలు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నాయి.
భారతీయ ఉద్యోగులు అధికంగా ఉండే సిలికాన్ వ్యాలీలోని సిస్కో సిస్టమ్స్ అనే టెక్సంస్థకు చెందిన ఒక ఉద్యోగి జూన్ 2020న కాలిఫోర్నియాలోని కోర్టులో దావా వేయడంతో ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ఉన్నత కులాలకు చెందిన అధికారులు తన కెరీర్ను అడ్డుకున్నారంటూ ఆ ఉద్యోగి ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను సిస్కో ఖండించింది. దర్యాప్తులో వివక్షతకు గురిచేసినట్లు ఆధారాలు లభించలేదని తెలిపింది.
సమస్యను ప్రైవేట్ మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవడానికి అప్పీల్ ప్యానెల్ తిరస్కరించడంతో ఈ దావా పబ్లిక్ కోర్టులో వచ్చే ఏడాది విచారణకు రావచ్చని రాయిటర్స్ తెలిపింది. ఇది అమెరికాలో కంపెనీల్లో కుల వివక్షపై నమోదైన మొదటి కేసు. ఈ కేసు అనంతరం పలువురు ఉద్యోగ సంఘాలు, కార్యకర్తలు అమెరికా వివక్షల చట్టాల్లో కులాన్ని కూడా చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కుల వివక్షతను అరికట్టేందుకు టెక్ కంపెనీలు కూడా తమ నిబంధనలను మార్చుకోవాలని సూచిస్తున్నారు.
24 మందికి పైగా దళిత టెక్ ఉద్యోగులు అమెరికాలోనూ తాము వివక్షతను ఎదుర్కొన్నామని రాయిటర్స్కు తెలిపారు. ఇంటి పేర్లు, స్వస్థలాలు, ఆహర నియమాలు, మతపరమైన ఆచారాల ద్వారా వివిధ కులాలకు చెందిన వారని గుర్తిస్తున్నారని తెలిపారు. దీంతో పదోన్నతులు కల్పించకపోవడం, ఇతర సామాజిక కార్యకలాపాలలో చేరకుండా వివక్ష చూపడం చేస్తున్నారని పేర్కొన్నారు. కులం కారణంగా తాము ఉద్యోగాలు కోల్పోయామని ఇద్దరు తెలిపారు.