ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించడంలో, అమలు పరచడంలో భారీ ఎత్తున అవినీతి చూటుచేసుకున్నట్లు ఎఫ్ఐఆర్ దాఖలు చేసి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు పలువురి ఇళ్లల్లో సిబిఐ సోదాలు జరపడం తెలంగాణలోని టిఆర్ఎస్ నేతలకు వణుకు పుట్టిస్తున్నట్లు తెలుస్తున్నది.
ఈ కుంభకోణంలో కొందరు కీలక టిఆర్ఎస్ నేతల ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 7 రాష్ట్రాలలో 21 చోట్ల సీబీఐ దాడులు నిర్వహించింది. హైదరాబాద్ లో కూడా సోదాలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు భేటి అయ్యారు.
ఆ సమయంలో కేసీఆర్ వెంట పలువురు టీఆర్ఎస్ ముఖ్యలు సైతం ఉన్నారు. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్లోని టీఆర్ఎస్ నేతలంతా అప్రమత్తమయ్యారు. కేంద్ర హోం శాఖ ఇచ్చిన సమాచారం మేరకు ఈ సోదాలు జరిగినట్టు తెలుస్తోంది.
సీబీఐ విచారణను తాము స్వాగతిస్తామని, తాము ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని, అందుకే ఈ విచారణలో ఎటవంటి అవకతవకలు బయటకు రావని మనీష్ సిసోడియా ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తమను కూడా సీబీఐ సోదాల పేరుతో వేధించవచ్చని టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు. పైగా ఢిల్లీ లిక్కర్ పాలసీ అవకవతకల వ్యవహారంలో టీఆర్ఎస్ పెద్ద నేతలున్నట్టు ఆరోపణలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. దీంతో టీఆర్ఎస్ నేతలు మరింత భయపడుతున్నారు.
కాగా, ఈ కుంభకోణంలో తెలంగాణకు సంబంధం ఉందని బిజెపి ఎంపీ పర్వేశ్ వర్మ ఆరోపించారు. కొత్త పాలసీ రూపకల్పన విషయంలో తెలంగాణలోనే అన్ని వ్యవహారాలు జరిగాయని ఆయన స్పష్టం చేశారు. ‘ఈ స్కామ్ కు తెలంగాణతో సంబంధం ఉంది. డీల్ సెట్ చేయడానికి తెలంగాణకు చెందిన వాళ్లు బుక్ చేసిన హోటళ్లు, రెస్టారెంట్లను మనీశ్ సిసోడియా సందర్శించారు. ఇందులో 10-15 మంది ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వ వ్యక్తులతో పాటు సిసోడియా ఉన్నారని నేను భావిస్తున్నాను’ అని వర్మ ఆరోపించారు.