ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల ద్రోహిగా మారారని, పేదల బద్ద వ్యతిరేకిగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీతమ్మను నగ్నంగా చిత్రీకరించడంతోపాటు శ్రీరాముడ్ని కించపర్చిన మూర్ఖుడు మునావర్ ఫారుఖీని సిగ్గు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కు తీసుకురావడం సిగ్గు చేటని మండిపడాడ్రు.
ఈ కార్యక్రమం ద్వారా హిందువులకు ఏ సంకేతాలను పంపదల్చుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజమైన హిందువులెవరూ మునావర్ ఫారుఖీ కార్యక్రమానికి వెళ్లొద్దని స్పష్టం చేస్తూ,ఆ కార్యక్రమానికి వెళ్లే వారంతా నకిలీ హిందువులేనని ధ్వజమెత్తారు. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తూ ఆత్మహత్యలకు పురిగొల్పుతున్న నారాయణ, చైతన్యసహా కార్పొరేట్ కళాశాలలను తక్షణమే
మూసివేయించాలని సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ఒక్క కానిస్టేబుల్ ను కూడా నియమించలేని వ్యక్తి హోంమంత్రిగా, ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేని వ్యక్తి గ్రుహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారని, అయినప్పటికీ వాళ్లంతా మంత్రి పదవులు పట్టుకుని వేలాడుతున్నరని ఎద్దేవా చేశారు.
సర్దార్ సర్వాయి పాపన్న స్పూర్తితో కేసీఆర్ పాలనను బొందపెట్టడంతోపాటు గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేసి తీరుతామని పునరుద్ఘాటించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ నడిబొడ్డున అతిపెద్ద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీంతోపాటు ఖిలాషాపూర్ ను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తామని, వెనుకబడ్డ గీత వ్రుత్తుల వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 17వ రోజు జనగాం పట్టణ శివారు నుండి చీటకోడూరు మీదుగా ఖిలాషాపూర్ వరకు మొత్తం 15 కి.మీలు నడిచారు. అందులో భాగంగా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని ఖిలాషాపూర్ గ్రామంలోని సర్దార్ సర్వాయి పాపన్న ఖిల్లా వద్ద స్థానిక జిల్లా నేతలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
పూర్తిగా కులవృత్తులు నిర్వీర్యం అయిన పరిస్థితి ఉందని పేర్కొంటూ కులవృత్తులను ప్రోత్సహించడానికి కేసీఆర్ చేపట్టిన ప్రణాళికలు ఏంటి? అని ప్రశ్నించారు. మునుగోడులో రోజుకు ఒక ఫుల్ బాటిల్ ఇస్తాడు. మునుగోడు ఉప ఎన్నిక లోపు… ఇన్ని సంవత్సరాలలో కెసిఆర్ చేసింది ఏంటో సమాధానం చెప్పాలని నిలదీశారు.
కులవృత్తులకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని, ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిరుపేదలకు ఇళ్లను నిర్మిస్తామని చెబుతూ కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు కలిసి… గిరిజన మహిళను రాష్ట్రపతి కాకుండా ఓడకొట్టే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు.
తెలంగాణ వస్తే నారాయణ, చైతన్య కాలేజీలను రాష్ట్రం పొలిమేరల దాకా తరిమికొడతామన్న సీఎం రాష్ట్రం నిండా ఆయా సంస్థలను కొనసాగిస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. కార్పొరేట్ కాలేజీల నుండి పెద్ద ఎత్తున కమీషన్లు దండుకుంటూ, పార్టనర్ షిప్ తీసుకుంటున్నారని ఆరోపించారు. అందుకే అడ్డూ అదుపు లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు.