కేసీఆర్ సర్కార్‌ను పడగొట్టేందుకు కాంగ్రెస్ మాజీ ఎమ్యెల్యే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేలా ఈ మునుగోడు సభను చూస్తుంటే అర్థమవుతోందని భరోసా వ్యక్తం చేశారు.
రాజగోపాల్‌రెడ్డిని బీజేపీలో చేర్చుకోవడమంటే.. కేవలం ఒక్క నాయకుడిని పార్టీలోకి తీసుకోవడం కాదని, ఇది కేసీఆర్ అవినీతి ప్రభుత్వ అంతానికి మార్గం వేయడమని ఆయన చెప్పారు. ‘‘మునుగోడులో రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి ప్రభుత్వం పతనానికి నాంది పడుతుంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుంది” అంటూ హర్షధ్వానాల మధ్య అమిత్ షా ప్రకటించారు.
రాజగోపాల్‌రెడ్డిని బీజేపీలోకి చేర్చుకునేందుకు తాను ఇక్కడికి వచ్చానని చెబుతూ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి లో చేరనున్న నేపథ్యంలో మునుగోడులో బిజెపి ఆదివారం సాయంత్రం సమరభేరి పేరిట భారీ సభ ఏర్పాటు చేసింది.
ఈ సభకు తెలంగాణ బిజెపి నేతలతో పాటు బిజెపి అగ్ర నేతలు హాజరయ్యారు. ముఖ్య అతిధిగా హాజరైన అమిత్ షా..రాజగోపాల్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని కేసీఆర్ గతంలో చెప్పారని, ఇచ్చిన మాటలు అమలు చేయని పాలన కేసీఆర్‌ది అంటూ అమిత్ షా మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రిని చూస్తారని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం కూలడం ఖాయమని జోస్యం చెప్పారు. మోదీ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి గంగానది ప్రవాహంలా ముందుకు సాగుతుందని ఆయన భరోసా ఇచ్చారు. కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలేవీ అమలు చేయడం లేదని విమర్శించారు. మజ్లిస్‌కు భయపడి విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ నిర్వహించడం లేదని ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా, ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు.
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఇల్లు ఇస్తామన్నారు..? ఇచ్చారా? అని అమిత్ షా ప్రశ్నించారు. అలాగే తెలంగాణలో దళితుడిని సీఎం చేస్తానని చెప్పారు.. కానీ ఇంత వరకు అలా జరగలేదన్నారు. మళ్లీ గెలిపిస్తే కేసీఆర్ స్థానంలో కేటీఆర్ వస్తారని, అలాంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని అమిత్ షా స్పష్టం చేశారు.
ప్రతీ దళిత కుటుంబానికి 10 లక్షలు అందిస్తామని హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ చెప్పారు.. ఎంత మంది దళితులకు 10 లక్షల రూపాయలు అందాయని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు.. ఎవరికైనా అందిందా..? అంటూ అమిత్ షా ఉద్వేగంతో ప్రశ్నించారు.
నిరుద్యోగులకు నెలనెలా రూ.3 వేల భృతి, నల్గొండ జిల్లా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ మంజూరు చేస్తున్న టాయిలెట్లు కూడా ప్రజలకు అందకుండా చేస్తున్నారని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.
“యువతకు ఉద్యోగాలు ఇస్తామని 2014 నుంచీ చెప్తూనే ఉన్నారు. కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడు, ఇతర బంధువులకు మాత్రమే ఉపాధి కల్పించుకున్నారు. కేసీఆర్, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు పదవుల్లో ఉంటే మాకు బాధ లేదు. కానీ ఆ కుటుంబ అరాచక పాలన వల్ల ప్రజలు ఎందుకు బాధపడాలి? ఎందుకు నష్టపోవాలి?” అంటూ ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలకు పెనుమార్పునకు నాంది అమిత్ షా చెప్పారు. ఇది కేవలం రాజగోపాల్ రెడ్డి చేరిక సభ కాదన్న అమిత్ షా.. వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్ వెళ్లిపోవడం ఖాయమని తేల్చి చెప్పారు