ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ మిగిలిన భారత దేశంలో విలీనం సంపూర్ణమనే సంకేతం ఇచ్చే విధంగా అక్కడున్న ఎవరైనా ఓటరుగా చేరవచ్చని ఎన్నికల కమీషన్ తాజాగా ప్రకటించింది. అసెంబ్లీ నియోజకవర్గాల పునరవ్యవస్థీకరణ ఈ మధ్యనే పూర్తి కావడంతో సత్వరం ఎన్నికలు జరిపే దిశలో ఓటర్ల జాబితా సవరణపై దృష్టి సారిస్తున్నారు.
జమ్ముకాశ్మీర్ ఎన్నికల ప్రధాన అధికారి (సిఇఒ) హిర్దేష్ కుమార్ ఈ నెల 17న జారీ చేసిన ప్రకటన ప్రకారం జమ్ముకాశ్మీర్‌లో సాధారణంగా నివసిస్తును వారందరూ ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనల ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతంలో ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. జమ్ముకాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తినికల్పించే ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్ముకాశ్మీర్, లడఖ్‌గా ముక్కలు చేసిన సంగతి తెలిసిందే.
దీనికి పూర్వం అంటే జమ్ముకాశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎన్నికల ఓటర్ల జాబితాలో పేర్లు లేనివాళ్లు సైతం ఇప్పుడు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చునని సిఇఒ తెలిపారు. ఈ నేపథ్యంలో జమ్ముకాశ్మీర్ తుది ఎనిుకల ఓటర్ల జాబితాలో దాదాపు 20-25 లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదు అయ్యే అవకాశముందని భారత ఎన్నికల సంఘం అంచనా వేస్తోందని ఆయన చెప్పారు.
దేశంలో అతిచిన్న వయస్సును (ఏర్పాటు పరంగా) కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకాశ్మీర్‌లో తొలిసారి జరుగుతున్న శాసనసభ ఎన్నికల కోసం ఇదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సైనిక బలగాలు ఓటర్లగా నమోదు చేసుకొని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావచ్చునని సిఇఒ కుమార్ ప్రకటించారు.
ఈ ఏడాది మే 20 నుంచి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అమల్లోకి తీసుకొచ్చిన డీలిమిటేషన్ కమిషన్ తుది ఉత్తర్వులను అనుసరించి పునరువ్యవస్థీకరించిన అసెంబ్లీ నియోజకవర్గాల ప్రకారంగా పాత ఓటర్ల జాబితాను సరిచేయనున్నట్లు సిఇఒ తెలిపారు.
జమ్ముకాశ్మీర్ పునర్వ్యస్థీకరణ చట్టం -2019 ప్రకారం..జమ్ముకాశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ ఏడు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలను ఏర్పాటు చేసింది. వీటిలో ఆరు జమ్ము డివిజన్‌లోనూ, ఒకటి కాశ్మీర్‌లోనూ ఉంది. వీటి ఆధారంగా జమ్ముకాశ్మీర్‌లో ఇప్పుడు ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం సవరిస్తోంది.
జమ్ముకాశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు చివరిగా 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతంగా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సివుంది. కేంద్ర ప్రభుత్వం ఏ క్షణాన ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన అందుకు సిద్ధంగా ఉండేవిధంగా డీలిమిటేషన్ ఈ ఎన్నికల జాబితాలను సంసిద్ధం చేస్తోందని సిఇఒ తెలిపారు.
2022 అక్టోబర్ 1వ తేదీ నాటికి 18వ సంవత్సరంలోకి ప్రవేశించే వారికి నూతన ఓటర్ల జాబితాలో చోటు కల్పించి వారికి కూడా ఓటు హక్కు కల్పించాలని భారత ఎన్నికల సంఘం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నవంబరు 25న తుది ఓటర్ల జాబితాను ప్రచురించే వీలుంది.
జమ్ముకాశ్మీర్‌లో ఓటరుగా నమోదు చేసుకోవడానికి నివాస ధ్రువీకరణ పత్రమేదీ సమర్పించాల్సిన అవసరం లేదని ఎన్నికల ప్రధాన అధికారి (సిఇఒ) తెలిపారు. ఉద్యోగులైనా, విద్యార్థులైనా, కూలీలైనా, వేరే ఎవరైనా సరే సాధారణంగా జమ్ముకాశ్మీర్‌లో నివసిస్తుంటే చాలు..వారందరూ వెలుపలివారైనా సరే ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవచ్చునని ఆయన ప్రకటించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భద్రత బలగాలు ఇక్కడ వుంటే వాళ్లు కూడా ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకొని ఓటింగ్‌లో పాల్గనవచ్చు అని ఆయన వివరించారు.
2019 ఆగస్టు 5 వరకు జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగ అధికారాలుండేవి. జమ్ముకాశ్మీర్ ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1957 నిబంధనల ప్రకారంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎనిుకలకు ఓటర్ల జాబితా రూపొందించేవారు. ఆ చట్టం ప్రకారం జమ్ముకాశ్మీర్‌లో శాశ్విత నివాసితులకు మాత్రమే ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకునేందుకు వీలుంది.
ఓటు హక్కు పొందేందుకు కోసం శాశ్విత నివాస ధ్రువీకరణ పత్రం, ప్రస్తుతమున్న నివాస ధ్రువపత్రం తప్పని సరిగా సమర్పించాల్సివుండేది. పశ్చిమ పాకిస్తాన్‌లోనూ, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ వలస వచ్చినవారు, ఇతర కారణాలతో ఆ ప్రాంతంలో నివాసముంటున్నా కూడా వారికి ఓటు హక్కుకు వీలుండేది కాదు.