మూడేళ్ళుగా దాటవేస్తూ వచ్చిన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చివరకు ఆదివారం నుండి నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా ఈ పదవి ఎవరు చేపట్టాలో అనే విషయమై ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. రాహుల్ గాంధీ తిరిగి చేపట్టాలని దాదాపు ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ అందుకు ఆయన తీవ్రంగా విముఖత వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు తన కుటుంభం నుండి ఎవ్వరు ఉండకూడదని స్పష్టం చేస్తుండడంతో ప్రియాంక గాంధీకి కూడా ఆ పదవి చేపట్టే అవకాశం లేదని వెల్లడవుతుంది. ఎలాగూ అనారోగ్యం కారణంగా ఆ పదవిలో కొనసాగించలేమని సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఆమెతో సహా, ఇంకా పార్టీలో పలువురు నాయకులు రాహుల్ గాంధీని ఒప్పించడానికి చేయవలసిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఈ నెల 28లోగా నామినేషన్ దాఖలు చేయవలసి ఉంది. రాహుల్ తన విముఖతను విడనాడని పక్షంలో గాంధీ కుటుంభం బయటివారిని ఆ పదవికి ఎన్నుకోక తప్పని పరిస్థితి నెలకొంది. అటువంటప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.
గెహ్లాట్ గాంధీ కుటుంబానికి నమ్మకస్తుడు మాత్రమే కాకుండా, పార్టీ సంస్థాగత వ్యవహారాలలో అనుభవం గల వ్యక్తి. రాజస్థాన్ లో రెండు సార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, మంత్రిగా పనిచేశారు. అందుకనే పార్టీలో ఎక్కువమంది ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు.
ఆయన కానీ పక్షంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముకుల్వాస్నిక్, లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. కనీసం ఒక పేరు చెప్పడానికి కూడా రాహుల్ సిద్ధపడటం లేదు. దానితో అధ్యక్షుడి ఎన్నికలో ప్రియాంక గాంధీ కీలకంగా మారే అవకాశం ఉంది.
