దేశవ్యాప్తంగా అన్ని పార్టీలను ఏకం చేస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తవానికి ‘‘లిక్కర్ ఫ్రంట్’’ పెట్టేందుకే ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నేతలతో చీకటి ఒప్పందం చేసుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. లిక్కర్ మాఫియాతో కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని ఆరోపించారు.
పంజాబ్ లో ని డ్రగ్స్ ను తెలంగాణకు విస్తరింపజేయడానికి, తెలంగాణలోని లిక్కర్ సామ్రాజ్యాన్ని పంజాబ్, ఢిల్లీ, బెంగాల్ రాష్ట్రాలకు విస్తరింపజేసుకునేందుకే పరస్పర చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సిబిఐ నిందితులుగా పేర్కొన్న రామచంద్ర పిళ్లై, శరత్, స్రుజన్ రెడ్డి, అభిషేక్ లు కేసీఆర్ కుటుంబ బినామీలని స్పష్టం చేశారు.
లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణ జరుపుతోందని, త్వరలోనే కుటుంబం బండారం బయటపడుతుందని స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం లో కేసీఆర్ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని వార్తలు వచ్చాయని పేర్కొంటూ కేసీఆర్ ఢిల్లీ, పంజాబ్ వెళ్తున్నది లిక్కర్ దందా కోసమే అని స్పష్టం చేశారు. లిక్కర్ సిండికేట్ చేసి, తన కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ఇప్పించడానికే వెళ్తున్నాడని దుయ్యబట్టారు.
రాష్ట్ర ప్రభుత్వ లిక్కర్ ఆదాయం రూ.4000 కోట్ల నుంచి, రూ.30 వేల కోట్లకు పెంచిండని తెలిపారు. ఢిల్లీ లో ఒబేరాయ్ హోటల్ లో లిక్కర్ మాఫియాతో కలిశారా..? లేదా..?. పిళ్ళై పెట్టిన ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్ళారా…? లేదా..అరుణ్ రామచంద్రయ్య పిళ్ళై శరత్, సృజన్ రెడ్డి, అభిషేక్ తో కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందా..? లేదా..? కేసీఆర్ సమాధానమివ్వాలని సంజయ్ డిమాండ్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ దందా లో కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా హస్తం ఉందని పేర్కొంటూ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసే లిక్కర్ దందా చేస్తున్నాయని సంజయ్ ఆరోపించారు. శరత్ ఎవరి బంధువు?. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వాటా ఉంది… ఇద్దరూ పంచుకుంటున్నారని అడుగుతూ కేసీఆర్ కుటుంబ సభ్యులకు ప్రమేయం ఉందా..? లేదా..? సీఎం సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు.