బీజేపీ ఎమ్యెల్యే రాజాసింగ్ ను హైదరాబాద్ లో, పాదయాత్రలో ఉన్న రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను జనగామలో పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు.
రాజాసింగ్ అప్ లోడ్ చేసిన వివాదాస్పద వీడియోపై ముస్లింలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఆయన ఇంట్లోకి వెళ్లి అరెస్ట్ చేశారు. తెలంగాణలో రాముడిని కొలిచే వారికే విలువ లేదని, తిట్టే వారికే విలువ ఉందని మండిపడ్డాయిరు. ప్రధానికి కూడా కల్పించనంత భద్రత మునావర్ ఫారూఖికి ఇచ్చి..షో ప్రదర్శించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో రాత్రి నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తమను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయనని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ కమిషనర్ కార్యాలయంతో పాటు భవానీ నగర్, డబీరపురా ,రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ ముందు ముస్లీం నేతలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు.
అయితే తాను ధర్మం కోసం తాను చావడానికైనా సిద్ధమని రాజా సింగ్ వెల్లడించారు. రాముడిని కించపరుస్తూ షో చేసిన మునావర్ ఫారూఖీని హైదరాబాద్ కు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినా షో ప్రదర్శించారని తెలిపారు. దండం పెట్టి వేడుకున్నా పోలీసులు వినలేదని చెప్పారు.
రాముడిని కించపరిచిన వ్యక్తికి పోలీసులు ఎలా రక్షణ కల్పిస్తారని కేటీఆర్ ను ప్రశ్నించారు. మునావర్ ఫారూఖికి కౌంటర్ వీడియోలు చేస్తానని ముందే చెప్పానన్నారు. రెండో భాగానికి సంబంధించిన వీడియో త్వరలో అప్ లోడ్ చేస్తాననని వెల్లడించారు. యాక్షన్ కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు.
మరోవంక, లిక్కర్ స్కాములో కేసీఆర్ కుటుంభం సభ్యుల పాత్ర ఉందనే ఆరోపణలు బయటకు వచ్చిన నేపథ్యంలో నిన్న బిజెపి కార్య కర్తలు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ , కేసీఆర్ కుమార్తె కవిత ఇంటివద్ద సోమవారం ఆందోళనలు నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసారు.
ప్రజాస్వామ్య యుతంగా నిరసన తెలుపుతున్న వారిపై హత్యాయత్నం కేసులు ఏమిటని అంటూ సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిలాల్లో సంజయ్ నిరసన దీక్ష చేపట్టగా పోలీసులు అడ్డుకొని ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బిజెపి కార్య కర్తలు పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులకు , బిజెపి కార్య కర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.
ఇలా ఉండగా, పాదయాత్రంలో సంజయ్ పై దాడులు జరిగే అవకాశం ఉందన్న వార్తలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం పామ్నూరు పాదయాత్ర శిబిరం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే పోలీసుల భద్రతను సంజయ్ తిరస్కరించారు. తన భద్రతను కార్యకర్తలే చూసుకుంటారని ఆయన చెప్పారు. కార్యకర్తలకు ఏదైనా జరిగితే అంతు చూస్తామని హెచ్చరించారు.