ఒక్కొక్కరుగా ముఖ్య నేతలు వెళ్లిపోతుండటంతో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం జైవీర్ షెర్గిల్ మాట్లాడుతూ గాంధీలపై విరుచుకుపడ్డారు. ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడే పరిస్థితి ప్రస్తుతం పార్టీలో కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.
పార్టీ చెప్పేదానికి, చేసే దానికి పొంతన లేకుండా పోయిందని విమర్శించారు. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా పార్టీ నిర్ణయాలు ఉండటం లేదని షెర్గిల్ ఆరోపించారు. సోనియా, రాహుల్, ప్రియాంకలను కలిసి పార్టీ పరిస్థితి గురించి వివరిద్దామని ఎంత ప్రయత్నించినా ఏడాదిగా తనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎనిమిదేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అంకితమై పనిచేశానని, తాను పార్టీ నుంచి తీసుకున్నదేమీలేదని స్పష్టం చేశారు. అధిష్టానం అడుగులకు మడుగులొత్తే వారికి అందలాలు దక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జైవీర్ షెర్గిల్ ప్రకటించారు.
అధికార ప్రతినిధిగా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పార్టీ అభిప్రాయాలను బలంగా వినిపించే నేతగా పేరున్న జైవీర్ షెర్గిల్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ నెలలో ఇప్పటికే ఇద్దరు సీనియర్లు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయగా, జైవీర్ షెర్గిల్ రాజీనామాతో ఆ సంఖ్య మూడుకు చేరింది.
ఇక అంతకు ముందు జ్యోతిరాదిత్య సింధియా, ఆర్పీ సింగ్, జితిన్ ప్రసాద, హార్ధిక్ పటేల్, కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఓ వైపు ఎన్నికల్లో వరుస వైఫల్యాలు పార్టీని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంటే, మరోవంక ముఖ్య నేతల పార్టీని వీడుతుండటం కాంగ్రెస్ ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.