ఈ ఏడాది జనవరిలో పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించే సమయంలో భద్రతా ఉల్లంఘన జరిగిందని సుప్రీంకోర్టు పేర్కొంది. మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యాలపౖౖె విచారణ చేపట్టిన కమిటీ పంజాబ్ పోలీసుల వైఖరిలో లోపాలున్నాయని, వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.
శాంతి, భద్రతలు పరిరక్షించడంలో ఫిరోజ్‌పూర్ సీనియర్ ఎస్పి విఫలమయ్యారని మాజీ జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ తెలిందని చెప్పింది. తగినంత భద్రత సిబ్బంది అందుబాటులోకి ఉన్నప్పటికీ, ప్రధాని మోదీ ఆ మార్గంలో వెళతారని రెండు గంటల ముందు తెలియజేసినప్పటికీ, సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఈ నివేదికను కేంద్రానికి పంపుతామని పేర్కొంది. జనవరి 5న ఎన్నికల ర్యాలీ కోసం ఫిరోజ్‌పూర్‌కు వెళుతున్న ప్రధాని మోడీకి అన్నదాతల నుండి నిరసన సెగ ఎదురైంది. హుస్సేనివాలా నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్లైఓవర్‌పై ఆయన 20 నిమిషాల పాటు ఆగిపోయిన సంగతి విదితమే.
ఇలా ఉండగా, బుధవారం పంజాబ్ పర్యటనకు వెళ్లిన ప్రధానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవత్ మాన్ గత జనవరిలో ఆయన పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా ఉల్లంఘనల పట్ల క్షమాపణ తెలిపారు. ఇకముందెన్నడు ఆ విధంగా జరుగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. “గౌరవనీయ ప్రధానిగా తమ రాష్ట్రానికి ఎప్పుడు వచ్చినా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతాము” అంటూ హామీ ఇచ్చారు.
