అమెరికాలో నలుగురు భారత సంతతికి చెందిన మహిళలపై ఓ మహిళ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా దాడి కూడా చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో మెక్సికో సంతతికి చెందిన ఆమెను టెక్సాస్ పోలీసులు అరెస్టు చేశారు.
భారత సంతతి మహిళలపై జాత్యహంకార పూరిత వ్యాఖ్యలు చేస్తూ.. భారత్కు తిరిగి వెళ్లిపోండి అంటూ అరిచినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ‘భారతీయులంటే నాకు అయిష్టం. మెరుగైన జీవితాల కోసం అమెరికాకకు వచ్చారు’ అంటూ ‘ఎఫ్’ పదజాలాన్ని పలుమార్లు వాడినట్లు వినిపిస్తోంది.
ఈ వీడియో అమెరికాలోని భారత కమ్యూనిటీలో విపరీతంగా వైరల్ అయింది. కాగా, ఆ మహిళను ప్లానోకు చెందిన ఎస్మెరాల్డా ఆప్టన్గా గుర్తించారు. ఈ వీడియోను పోస్టు చేసిన వ్యాక్తి.. ఈ సంఘటన టెక్సాస్లోని డల్లాస్లో మా అమ్మ, తన ముగ్గురు స్నేహితులతో భోజనానికి వెళ్లాక జరిగిందని పేర్కొన్నారు.
ఆ వీడియోలో భారత సంతతి మహిళలతో అసభ్యంగా మాట్లాడుతూ జాత్యంహకార దూషణలు చేస్తున్నారు. అయినప్పటికీ భారత సంతతి మహిళ అలా అనవద్దని అభ్యర్థించారు. అయినప్పటికీ ఊరుకుని మెక్సికన్ సంతతి మహిళ.. ‘నేను అమెరికాలో జన్మించా.. నేను ఎక్కడికి వెళ్లినా, భారతీయులు ప్రతిచోటా ఉన్నారు’ అంటూ తన అక్కసును వెళ్లగక్కుతూ..వారిపై దాడి చేశారు.
భారత్లో మీ జీవితాలు బాగుంటే.. ఇక్కడ మీరెందుకున్నారంటూ మాట్లాడారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న ప్లానో పోలీసులు ఆమెను అరెస్టు చేసి, దాడులు, ఉగ్రవాద బెదిరింపులు వంటి అభియోగాలు మోపారు.