తాను ప్రజాస్వామ్యబద్ధంగా పాదయాత్ర చేస్తుంటే సీఎం కేసీఆర్ డైరెక్షన్లో కొందరు అల్లర్లు సృష్టించి యాత్రను అడ్డుకునే కుట్రలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినా, చివరకు న్యాయమే గెలిచిందని సంతృప్తి వ్యక్తం చేశారు.
శుక్రవారం ఉదయం జనగామ జిల్లా పామునూరు నుంచి ప్రజా సంగ్రామ యాత్ర మళ్లీ ప్రారంభించి, వరంగల్ జిల్లాకు చేరుకున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు చేపడుతున్న యాత్రను ఆపేది లేదని స్పష్టం చేశారు. శుక్రవారం హనుమకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోకి ప్రవేశించి ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి, నాగపురం, ఐనవోలు మీదుగా ఓరుగల్లుకు చేరుకుంది.
హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో బీజేపీ సభకు అనుమతి ఇస్తూ శుక్రవారం మధ్యాహ్నం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత నాగపురం వద్ద సంజయ్ మీడియాతో మాట్లాడుతూ శాంతిభద్రతలను సాకుగా చూపి బీజేపీ సభను అడ్డుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కుటుంబంపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే యాత్రకు, సభకు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు.
బీజేపీ సభకు పర్మిషన్ లేదని చెబుతున్న పోలీసులు.. రాముడిని, సీతమ్మవారిని అవమానిస్తున్న మునావర్ ఫారుఖీ షోకు ఎలా పర్మిషన్ ఇచ్చారని సంజయ్ ప్రశ్నించారు. శనివారం జరిగే బహిరంగ సభకుపార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
గర్మిళ్లపల్లి వద్ద ఉద్రిక్తత
కాగా, సంగ్రామ యాత్రను టీఆర్ఎస్ కార్యకర్త అడ్డుకునే ప్రయత్నం చేయడంతో జఫర్ఘడ్ మండలం కూనూరు, ఐనవోలు మండలం గర్మిళ్లపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కూనూరు గ్రామంలోకి వస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్త చాగంటి రాజు ఒక్క సారిగా దూసుకువచ్చి బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశాడు.
దీంతో బీజేపీ కార్యకర్తలు అతడిని నెట్టివేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో బీజేపీ కార్యకర్తలు పలువురు గాయపడ్డారు. గర్మిళ్లపల్లిలో టీఆర్ఎస్ నాయకులు యాత్రను అడ్డుకునేందుకు సిద్ధమయ్యారనే సమాచారంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.
ఐనవోలుకు చేరుకున్న తర్వాత సంజయ్ అక్కడ మల్లికార్జునస్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసి, పాదయాత్ర కొనసాగించారు. పున్నేలు మీదుగా బొల్లికుంట చేరుకున్నారు. శనివారం ఉదయం బొల్లికుంట వాగ్దేవి కాలేజీ నుంచి మామునూరు, నాయుడు పంపు, శంభుని పేట మీదుగా వరంగల్ భద్రకాళి ఆలయానికి చేరుకోనున్నారు.