సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణస్వీకారం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ యూయూ లలిత్ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్రంలోని పెద్దలు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, ప్రస్తుత జడ్జిలు హాజరయ్యారు.
మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా హాజరయ్యారు. సీజేఐ యూయూ లలిత్ 1957 నవంబర్ 9న మహారాష్ట్రలోని షోలాపూర్ లో జన్మించారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. 2014 ఆగస్ట్ 13న ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. న్యాయవాది నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా నేరుగా బాధ్యతలను స్వీకరించిన ఘనత ఈయనది.
దేశ చరిత్రలో జస్టిస్ యూయూ లలిత్ తో పాటు మరొకరు మాత్రమే లాయర్ నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ అయ్యారు. మరోవైపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ అతి కొద్ది కాలం మాత్రమే బాధ్యతలను నిర్వహించనున్నారు. కేవలం 74 రోజుల్లోనే ఆయన పదవీ కాలం ముగియనుంది. త్రిపుల్ తలాక్ సహా, అనేక కీలక కేసుల తీర్పుల్లోనూ జస్టిస్ లలిత్ భాగస్వామిగా ఉన్నారు.