గణేష్ భక్తులకు మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వం లోని సంకీర్ణ ప్రభుత్వం గణేష్ ఉత్సవాల కోసం రోడ్డు మీదుగా స్వగ్రామాలకు వెళ్లే భక్తులకు టోల్ మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఆగస్టు 27 నుంచి ఈ టోల్ ఫ్రీ అమలు లోకి వచ్చింది.
ప్రతి సంవత్సరం గణేశోత్సవాలలో పాల్గొనేందుకు ముంబై నుంచి కొంకణ్ దిశగా వెళ్లే వాహనాల సంఖ్య అధికంగా ఉంటుంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ముంబై బెంగళూర్ రహదారి, ముంబై గోవా రహదారులతోపాటు ఇతర పీడబ్లుడీ రోడ్ల మీదుగా వెళ్లే వాహనాలకు ఈనెల 27 నుంచి సెప్టెంబరు 11 వరకు టోల్ మాఫీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి షిండే ప్రకటించారు.
కరోనా కారణంగా గత రెండేళ్లుగా సార్వజనిక గణేశోత్సవ మండళ్లు, ఇళ్లలో ప్రతిష్టించుకునే వారు ఉత్సవాలు సాదాసీదాగా నిర్వహించారు. అలంకరణ పనులకు కూడా చాలా తక్కువ స్ధాయిలో ఖర్చు చేశారు. కానీ ఈసారి బీజేపీ ప్రభుత్వం ఆంక్షలన్నీ ఎత్తివేయడంతో ఇళ్లలో ప్రతిష్టించుకునే వారు, సార్వజనిక మండళ్లు భారీగా ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
అయితే, విగ్రహాల ధరలు, అలంకరణ సామాగ్రి ధరలు పెరగడంతో ఉత్సవాలపై నీళ్లు చల్లాల్సిన పరిస్ధితి వచ్చింది. పెరిగిన నిత్యావసర సరుకులు, కూరగాయలు, వంట గ్యాస్ ధరలతో సతమతమవుతున్న వినాయకుని భక్తులకు గణేశ్ విగ్రహాలు, అలంకరణ సామాగ్రి ధరలు కూడా తోడయ్యాయి.
విగ్రహాల తయారీకి ఉపయోగించే నల్ల మట్టి, రంగులు, ఇనుప చువ్వలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ), కలప తదితర సామాగ్రి ధరలు 25–30 శాతం పెరిగాయి. అంతేగాకుండా వర్క్ షాపుల్లో విగ్రహాలను తయారుచేసే కళాకారులు, కార్మికుల జీతాలు కూడా పెంచాల్సి వచ్చింది. ఫలితంగా విగ్రహాల ధరలు పెంచక తప్పలేదని తయారీదారులు అంటున్నారు.
విగ్రహాలతోపాటు మండపాల నిర్మాణానికి వినియోగించే వెదురు బొంగులు, ప్లాస్టిక్ పేపర్లు, తాడ్పత్రి, అలాగే «థర్మాకోల్, గ్లూ, రంగురంగుల కాగితాలు, విద్యుత్ దీపాలు, లేజర్ లైట్ల తోరణాలు తదితర అలంకరణ సామాగ్రి ధరలు 10–20 శాతం పెరిగాయి. అదేవిధంగా పూజా సాహిత్యం ధరలు 20–25 శాతం పెరిగాయి. దీంతో ఈ ఏడాది గణేశోత్సవాలు నిర్వహించే పేదలు, మధ్య తరగతి కుటుంబాల ఆర్ధిక అంచనాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. ఉత్సవాలకు భారీగా నిధులు కేటాయించాల్సిన పరిస్ధితి వచ్చింది.
పెరిగిన సామాగ్రి ధరల ప్రభావం సార్వజనిక గణేశోత్సవ మండళ్లపై అంతగా పడకపోయినప్పటికీ ముఖ్యంగా ఇళ్లలో ప్రతిష్టించుకుని పేదలు, సామాన్య భక్తులపై తీవ్రంగా చూపనుంది. మరోవంక, కరోనా కాలంలో అమలుచేసిన లాక్డౌన్ వల్ల ఉపాధి లేక అనేక మంది కళాకారులు, కార్మికులు స్వగ్రామాలకు తరలిపోయారు. అందులో అనేక మంది తిరిగి రాలేకపోయారు. దీంతో కళాకారులు, కార్మికుల కొరత ఏర్పడింది.