ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌కు మద్దతుగా జమ్మూ కశ్మీరుకు చెందిన మరో ముగ్గురు కాంగ్రెస్ నాయకులు సోమవారం పార్టీకి రాజీనామా చేశారు. వీరిలో మాజీ డిప్యుటీ స్పీకర్ గులాం హైదర్ మాలిక్ ఉన్నారు.
కతువా జిల్లాకు చెందిన బనీ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అయిన మాలిక్‌తో పాటు ఇద్దరు మాజీ ఎంఎల్‌సిలు తమ రాజీనామా లేఖలను పార్టీ అధిష్టానానికి పంపారు. ఆజాద్‌కు మద్దతుగా ఈ ముగ్గురు నాయకుల నుంచి తమకు లేఖలు అందాయని ఆజాద్ సన్నిహితుడు, మాజీ మంత్రి జిఎం సరూరి తెలిపారు.
ఇలా ఉండగా మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్, మాజీ మంత్రులు అబ్దుల మజీద్ వాని, మనోహర్ లాల్ శర్మ, ఘరూ రాం, మాజీ ఎంఎల్ఎ బల్వాన్ సింగ్ సోమవారం ఢిల్లీలో ఆజాద్‌ను కాలిశారు. వీరు కూడా మంగళవారం ఆజాద్‌కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే డజను మందికి పైగా మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, వందలాది మంది పంచాయత్ రాజ్ సంస్థల సభ్యులు, జిల్లా, బ్లాక్ స్థాయి నాయకులు కాంగ్రెస్‌ను వీడి త్వరలోనే జాతీయ స్థాయిలో పార్టీని ఏర్పాటు చేయనున్న ఆజాద్‌తో చేతులు కలిపారు.
ఏ క్షణమైనా కాంగ్రెస్ కూలిపోతుంది
ఇలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్ల క్రితం సోనియా గాంధీపై ఎలాంటి గౌరవం ఉందో ఇప్పుడు కూడా ఆమె అంటే తమకు గౌరవమని రాజీనామా అనంతరం తొలిసారి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇందిరాగాంధీ కుటుంబ వారసుడిగా.. రాజీవ్ -సోనియా కుమారుడిగా రాహుల్ ను కూడా తాము గౌరవిస్తున్నామని పేర్కొన్నారు.
రాహుల్ ను సక్సెస్ ఫుల్ లీడర్ గా చేయాలని అనుకున్నామని, కానీ ఆయన ఆసక్తి చూపించలేదని నిర్వేదం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మంచి వ్యక్తే కానీ, రాజకీయ నాయకుడు కాదని ఆజాద్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని తాను బలవంతంగా వీడాల్సి వచ్చిందని ఆజాద్ చెప్పారు. , జీ23 నేతలతో కలిసి తాను అధిష్టానానికి లేఖ రాసినప్పటి నుంచే తనను టార్గెట్ చేశారని తెలిపారు.
ఎన్నోసార్లు కాంగ్రెస్ సమావేశాలు జరిగాయని, అయితే తానిచ్చిన ఏ సలహాను కూడా తీసుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. అందుకే తట్టుకోలేక ఆ లేఖ రాసినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు మాత్రం తన రాజీనామాకు ప్రధాని మోదీని సాకుగా చూపుతున్నారని ధ్వజమెత్తారు.
జీ23 నేతలతో కలిసి తాను పార్టీ అధిష్టానానికి లేఖ రాసిన తర్వాత నిద్రలేని రాత్రులు గడిపానని గులాంనబీ ఆజాద్ తెలిపారు. అయితే ఎప్పుడూ కూడా పార్టీకి రాజీనామా చేయాలని అనుకోలేదన్నాడు. కానీ తన ఇంట్లో నుంచి తననే బలవంతంగా వెళ్లిపోయేలా చేశారని ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకత్వానికి లోపాలను సరిదిద్దుకునే సమయం లేదన్న గులాం నబీ ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నవారంతా పనికిరానివారని మండిపడ్డారు. రాష్ట్రాల అధ్యక్షులు కాంగ్రెస్ సభ్యులను ఏకం చేయాల్సింది పోయి, ఇతరులను పార్టీని వీడేలా చేస్తున్నారని ఆరోపించారు. మూలుగుతున్న కాంగ్రెస్‌కు డాక్టర్ నుంచి కాకుండా కంపౌండర్ నుంచి మందులు అందుతున్నాయని ఎద్దేవా చేశారు.