ఆగస్టు 2022 నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారీగా వసూళ్లయ్యాయి. ఆగస్టు నెలలో వసూలైన స్థూల జీఎస్టీ రాబడి రూ. 1,43,612 కోట్లు. ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ. 24,710 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ. 30,951 కోట్లుగా ఉంది.
అలాగే ఐజీఎస్టీ రూ. 77,782 కోట్లుగా ఉంది. ప్రభుత్వం ఐజీఎస్టీ నుండి సెంట్రల్ జీఎస్టీకి రూ.29,524 కోట్లు, స్టేట్ జీఎస్టీకి రూ.25,119 కోట్లు సెటిల్ చేసింది. రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత ఆగస్టు 2022 నెలలో కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయం సీజీఎస్టీ రూ. 54,234 కోట్లు, ఎస్టీఎస్టీ రూ. 56,070 కోట్లుగా ఉంది.
గత ఏడాది ఆగస్టు నెలలో రూ.1,12,020 కోట్ల మేర జీఎస్టీ వసూలైంది. ఇప్పుడు వరుసగా ఆరు నెలలుగా నెలవారీ జీఎస్టీ ఆదాయాలు రూ. 1.4 లక్షల కోట్ల మార్కు కంటే ఎక్కువగా ఉన్నాయి. జూలై 2022 నెలలో 7.6 కోట్ల ఇ-వే బిల్లులు జనరేట్ అయ్యాయి.
జూన్ 2022లో 7.4 కోట్ల ఇ-వే బిల్లులు జనరేట్ అయ్యాయి. కాగా ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు నెలలో జీఎస్టీ రూ. 3,173 కోట్ల మేర వసూలైంది. గత ఏడాది ఆగస్టులో ఇది కేవలం రూ. 2,591 కోట్లుగా ఉంది. అంటే 22 శాతం వృద్ధి నమోదైంది.
అలాగే తెలంగాణలో ఆగస్టు నెలలో జీఎస్టీ రూ.3,871 కోట్ల మేర వసూలైంది. గత ఏడాది ఆగస్టులో ఇది రూ.3,526 కోట్లుగా ఉంది. అంటే 10 శాతం వృద్ధి నమోదైంది.